మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి!

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి!

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.

ఉద్యోగం మానకూడదు:

కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

అవగాహన పెంచుకోవాలి:

ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి.

ఇవి కూడా గుర్తుంచుకోవాలి...

మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది.

మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి.

పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.