వర్షాకాలంలో వేధించే చుండ్రుకు ఇలా చెక్ పెట్టవచ్చు..!
posted on Jul 13, 2024
వర్షాకాలంలో వేధించే చుండ్రుకు ఇలా చెక్ పెట్టవచ్చు..!
చుండ్రు జుట్టుకు సంబంధించి చాలామంది ఎదుర్కునే సమస్యలలో ప్రదానమైనది. స్కాల్ప్ పై చర్మం విపరీతంగా పొడిబారినప్పుడు చుండ్రు సమస్య మొదలవుతుంది. చుండ్రు ఉన్నప్పుడు తలను దువ్వినా, తలను గోక్కున్నా తెల్లని పొడిలాగా రాలుతూ ఉంటుంది. దీని కారణంగా చాలామంది ఇబ్బందికి గురవుతారు. చుండ్రు కారణంగా తలలో వివిధ ప్రదేశాలలో దురద కూడా ఉంటుంది. ఇది మెల్లగా ముఖం మీద కూడా దురద, ఇతర చర్మపు చికాకులు రావడానికి కారణం అవుతుంది. ఈ చుండ్రును వదిలించుకోవడానికి ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకుంటే..
బేకింగ్ సోడా..
జుట్టును తేలికగా తడిపి బేకింగ్ సోడాను తలకు పట్టించాలి. దీన్ని వేళ్లతో రుద్దాలి. సుమారు 5 నిమిషాలు ఉంచి ఆపై దానిని కడగాలి. బేకింగ్ సోడా చుండ్రును తొలగిస్తుంది. అయితే జుట్టు పాడవకుండా ఉండాలంటే పరిమిత పరిమాణంలో మాత్రమే దీన్ని వాడాలి.
నిమ్మరసం..
2 చెంచాల నిమ్మరసాన్ని తలకు పట్టించి కొన్ని నిమిషాలు ఉంచడం వల్ల అద్భుతమైన ప్రభావాలు కనిపిస్తాయి. ఒక కప్పు నీటిలో అర నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. చుండ్రును తొలగించడానికి, ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి ఆపై జుట్టును కడగాలి.
ఆస్పిరిన్ ..
ఆస్పిరిన్ మాత్రలు చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. 2 ఆస్పిరిన్ మాత్రలను గ్రైండ్ చేసి షాంపూలో కలపాలి. ఈ షాంపూతో మీ జుట్టును కడగాలి. 2 నుండి 3 నిమిషాలు జుట్టు మీద షాంపూ ఉంచుకోవాలి. తద్వారా ఆస్పిరిన్ ప్రభావం కనిపిస్తుంది. ఆస్పిరిన్‌లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చుండ్రు షాంపూలలో కనిపించే ఒక పదార్ధం.
అలోవెరా..
తాజా కలబంద గుజ్జును జుట్టు మూలాలపై రుద్దాలి. కలబందను కొంత సేపు అలాగే ఉంచిన తర్వాత జుట్టును కడిగి శుభ్రం చేసుకోవాలి. జుట్టు నుండి చుండ్రు తొలగిపోవడమే కాదు దురద సమస్య కూడా పోతుంది. జుట్టు మృదువుగా మారుతుంది.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె కూడా చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 3 నుంచి 4 చెంచాల కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. చుండ్రును తొలగించడంలో ప్రభావం చూపిస్తుందిది.
ఆపిల్ సైడర్ వెనిగర్..
ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావం జుట్టును శుభ్రపరచడంలో కూడా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తలకు పట్టించాలి. యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లను జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. చుండ్రు తొలగిపోతుంది.
*రూపశ్రీ.