Read more!

అమ్మ లేని నేనులేనే లేను

అమ్మ లేని నేనులేనే లేను అవును..పెద్దవుతున్నకొద్దీ....అమ్మలేదని తట్టుకోలేక తిట్టుకుంటానేమో కాని కన్నతల్లి తలపులు తట్టిలేపుతూండడం అనుక్షణం నా దినచర్యలోపెనవేసుకుపోతున్నతరుణం..ఇంతలోనే ఈశీర్షికతోమది తలుపులు తెరచి తలపులు తెలుపమంటూ పిలుపు!!నా జీవనరాగంలో అమ్మ ముద్ర ,మార్కు మరీప్రస్ఫుటం..ఎంతో ప్రధానం..ప్ర ప్రథ మ స్థానం..మా అమ్మకి ఏడుగురు సంతానం..నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు..మధ్యనంబరునాది.పెద్దకూతురని అక్క స్పెషలు..పెద్దాడంటూ అన్నయ్య,చిన్నదని చెల్లి..చిట్టచివరాడని తమ్ముడు...మరి మధ్యవారి మాటేమిటి?? అక్కడికే వస్తున్నా!!మానాన్నగారికి బ్యాంకేలోకం..దైవికంగా సంప్రాప్తించిన జ్యోతిష్యం ఆయన పూర్వజన్మ సుకృతం..నేను పుడుతూనే ఆయనన్నారట.."ఇదికళలలో రాణిస్తుందీ "అని..గ్రహస్థితులబట్టి అనుకుంట...అమ్మ అందటా..."ఏడిసింది..బల్లిలా పుట్టింది..బతికి బట్టకట్టనివ్వండీ "అని. ..నాకు ఊహతెలిసి ఎనిమిదొచ్చేసరికి మేమంతా హైదరాబాదుకు బదిలీ మీదొచ్చాం..అంతే..ఏగ్రహబలమో..నేనీ ఊరుకదిలితే ఒట్టూ..బాల్యంలో బాలానందసంఘంలో కళలపట్ల నానగారికున్న మక్కువతో నన్ను చేర్చారు అంతే..మిగతా అంతా అమ్మే...సంగీతం..నాట్యం..నాటకం.. వారునేర్పితే ...క్రమశిక్షణ,సమయపాలన,పెద్దలపట్ల గౌరవం..మర్యాద,కంటిచూపుతోనే నేర్పేది అమ్మ..నేర్చుకున్నకళలకు సంపూర్ణంగా న్యాయంచేసినది అమ్మవల్లే..ఆకతాయిగా ఉందామనిపించినా మా ఆటలు సాగనివ్వలేదు అమ్మ.కళలుకాస్తా.. వయసుతో పాటు అటకెక్కినా...అమ్మఅందించిన అమూల్యాలు...నాతోనే..నావెంటే ఉంటూ..అనుక్షణం అమ్మని తలపిస్తాయి..ముఖ్యంగా ఒకటి అరా కన్నటువంటి మా అందరికి...ఇంతమందినికని..అంతబాగా ఎలా పెంచిందన్నది అంతుచిక్కదు..నటనలో ప్రతిభ కనబరుస్తుందంటూ పెద్దల ప్రశంసల మేరకనుకుంట...ఆకాశవాణి..దూరదర్శన్ లలో నన్ను పదిహేడేళ్ళకే అడల్ట్ ఆర్టిస్టుగా ఆడిషన్ పరీక్షకి రమ్మన్నారు..ససేమిరా అంటూ మొండికేశాను.."చీరకట్టుకెళ్ళాలట..నాకురాదు..అయినా నాకు డిగ్రీ మొదటి ఏడాదిపరీక్ష...తలనొప్పి..అహ..ఊహూఁ..నావల్లకాదు" అంటూ అమ్మకి నేపెట్టిన పేచీ ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పానో... అమ్మ ఈఊరికి రాకమునుపు నాన్నగారి ఉద్యోగ బదిలీలంటూ ఆంధ్రా అంతా చుట్టేశారుట..నాకు గుర్తులేదు..అమ్మకి వాళ్ళమ్మ పురిట్లోనే పోయారట..అమ్మమ్మతాతలు పదేళ్ళకే ఐదోక్లాసు చదువు అర్జంటుగా ఆపించి,పెళ్ళిచేసేశారట పదిహేడేళ్ళ మానానగారికిచ్చి...ఇదే మా అమ్మనేపథ్యం..అమ్మకి అన్ని ఊళ్ళలోనూ...ఇరుగుపొరుగు వారే పురుళ్ళూ గట్రాలకి సాయమట...పెద్దలు అప్పటికే టపా కట్టేసినందుకేమో...తెలీదు!బొత్తిగా ఊరుకూడా తెలియని అమ్మ ఆడిషన్ రోజు ఎక్కడెగ్గొట్టి ఇంటికి చక్కా వచ్చేస్తానోనని..ఏకంగా కోఠీ..ఉమెన్స్ కాలేజీకి రిక్షా కట్టించుకుని వచ్చేసి..మెయిన్ గేటుదగ్గర కాపలా కూర్చుని ఆలిండియా రేడియోకి తీసుకెళ్ళి..ఆడిషన్టెస్టుకి వెనకాలే ఉండిచెఱకు రసం ఇప్పించి తీపిగుర్తుగా ఇప్పటికీ నిలిచిపోయింది..ఆ పరీక్షే ఇప్పటికీ నాకు చిరుసంపాదనతో పాటు పెను గుర్తింపును ఆపాదిస్తూ వస్తోంది..స్వతహాగా పరమపిరికి నైన నేను అందివచ్చిన ప్రతి అవకాశానికి మొరా యించేదాన్ని...చదువుకలో వెనకబడడం...టైముసరిపోకపోవడంనాకు నచ్చేదికాదుమరి!  అన్నీ అవసరమనేది అమ్మ..నిజమే...అదితెలిసాకే అమ్మవిలువ అవగతమయ్యేది...రేపు నా  ఏకైక పుత్ర రత్నానికైనా!! నాగురించి అమ్మచెప్తూండే మరో మాట..పసితనంలో కారణంచెప్పకుండా గంటల తరబడి ఏడుపు...అలకలూ నట..ఎందుకోమరి..తెలిస్తే మీకైనా చెప్పడానికి సిద్ధమేనేను!! ఆవసూ ఏనా ఈ వసువులు అంటూ చాలా మెచ్చుకునేది..వంటపని..ఇంటిపనిలో నా ఒబ్బిడి,,పద్ధతి..ఖర్చుల్లో పొదుపు..అటు ఉద్యోగంలో కమిట్మెంటు..అన్నీ..మనసారా చూసిందేమో..తన పోలికలు పిల్లలందరికీ అబ్బేయి అని తెగ మురిసిపోయేది..దుబారా అంటేఅమ్మకి నచ్చదు..ఆమాట ఆవిడనోటవిన్నదే..మళ్ళా ఎవరినోటావినలేదు..కొన్నిమాటలు అచ్చంగా అమ్మసొంతం..నిజమే...మాపిల్లలని చూస్తే అమ్మ తరం వారంతా ధన్యులనిపిస్తుందిసుమండీ.. ఇరవైమూడుకే పెళ్ళైనా ,అమ్మున్న ఊరే కనుకేమో..బెంగ ..చొంగ లాంటివిలేవు.ఎటొచ్చీ ఉద్యోగం మూలాన అడపా తడపానే కలిసే వాళ్ళం.ఫోనుల్లో అప్డేట్లు ఒకస్నేహితురాలికి మల్లే వినేది..ఏనాడు పిల్లలసంసారాల్లో తలదూర్చలేదు.తరువాతగాని తెలియలేదు అది సైద్ధాంతికపరమైన నిర్ణయమనీ,,చాలారైటు అనీ..!! ఇంటిల్లిపాది పెళ్ళిళ్ళూపదిహేనేళ్ళ నిడివిలో అయ్యాయి..చివరితమ్ముడి కళ్యాణం ఒక్కదానికే నాన్నగారులేరు.యాభైఏళ్ళతోడు...అమ్మకి మరీకష్టకాలమే..అయినా ఒక్కరోజు ఎవ్వరినీ తనబాధ నుతెలిపి ఇబ్బంది పెట్టలేదు..అందరిదగ్గరా అదే సర్దుబాటుగుణం...ఎంతమొక్కినాతక్కువే..!!రికార్డింగులకెడితే ఇప్పటికీ...నన్ను ....అమ్మనివెంటబెట్టుకొచ్చేదాన్నని ఆటపట్టించే వారెందరో!! ఇలా ఉంటుండగా...ఓసారి ఆంధ్రజ్యోతి నవ్యవారు..౨౦౦౬లోననుకుంట...నాపాతికేళ్ళ గళానుభవాన్ని పేపరుకెక్కించడానికి...ఇంటర్వ్యూకని ఇంటికొచ్చారు..ఫోటో గ్రాఫర్ తో సహా..ఇప్పటికి  కంప్లీటుగా భిన్నంగా...!వాట్సప్పులు..ఫేసుబుక్కులు లేవుగాఅపుడూ!!బోలెడుకబుర్లు రాబట్టి "మాటలకోకిల "పేరుతో ప్రచురించారు పేపరులో..ఇప్పటిలాగా క్షణాల్లోవార్త..  ఖండాలు దాటే వీలులేనికాలం.కనుక ఏకొద్దిమందికో అదీ చెప్పుకుంటేనే తెలిసేది.."అమ్మ"కనుక ఆపేపరును లామినేటుచేయించి తలగడకిందే పెట్టుకుని ఇంటికి వచ్చిన ,తనకు నచ్చిన వారికి చూపుకుని తన తనయను కొనియాడుకుని  పరవశించేదని వినికిడి..ఇంతలో ఓరోజు అమ్మ అదోలా మాట్లాడుతూ.." అవున్లేమ్మా...నీకు మొదట్నించీ వెనకే ఉంటూ ,,నువు ఆడినా పాడినా మురిసిపోతూ ఉన్నందుకు..భలేగా గుర్తుంచుకున్నావులేవే...ఆఖరికి నువు దూరమెళ్ళలేనని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్.ఎస్సి .మానేస్తే అక్కడే గదితీసుకుని నానగారిని వదిలైనాసరే  నీతోనే ఉండటానిక్కూడా సిద్ధపడ్డానుకదమ్మా అప్పట్లో...అందుకనేనేమో..మా బాగా బుద్ధిచెప్పావు అంటూ వగచింది..మొట్టమొదటిసారి అమ్మనాతో ఇలాంటి దెప్పిపొడుపుడైలాగువేయడం!!మైండుబ్లాకైంది..కూపీ లాగాను..కట్చేస్తే,,ఇంటికొచ్చిన ఆపేపరుపెద్దలకి చాలనేవరకు కబుర్లునేనేచెప్పినా,,వారు కాస్తతికమకపడి కొన్నివిషయాలను మకతిక చేసి రాస్తారని నాకు చాలా ఏళ్ళక్రితమేతెలిసినా,,చేసిపొడిచేదేంటిలే అని లైట్ తీసుకున్నాను..ఇపుడు మరోసారి పునరావృతమై...అమ్మకెక్కడోముల్లులా గుచ్చుకుని.. ఎక్కుపెట్టిన బాణంలానన్నుదూసుకునిపోయింది..తుంటినికొడితే పళ్ళు రాలడం అంటే ఇదేనేమో,,,నాట్ స్యూర్!!రాసుకెళ్ళిన పెద్దమనిషి..అమ్మమాట,మాటవరసకైనా రాయకుండా..మానాన్నగారి పేరు మాత్రమే రెండుసార్లు ఉటంకించి..ఆయన మంచి కళాభిమాని కావడం వలననే..నేను ఇలాతయారయ్యానని,అంతా తండ్రిగారిచలవేనని నేనే నొక్కివక్కాణిస్తేనే  ఆయన రాసినట్టు అమ్మ అర్థం చేసుకున్నట్టు నాకర్థమైంది.. ఎలా చెప్పినా అమ్మ వినేలాకూడా కనిపించకపోవడంతో...నేనే కాపుకాచి..అవకాశంఅందివస్తే అమ్మకిన్యాయం అర్జంటుగా చేసెయ్యాలి అని మనసులో దృఢంగా తలపోశాను,అడిగి రాయించుకోడం అస్సలు నడవదునాకు..అలాఉండుంటే ఆకాశమే హద్దుగా పెద్దయ్యేదాన్ని.అమ్మేమో పెద్దదైపోతోంది...ఎలాగబ్బా అనుకుంటుండగా...౨౦౦౯లో హెచ్.ఎమ్ టివి ప్రారంభంలో..."ఆకాశంలో సగం "అంటూఒక ప్రోగ్రామ్ లో నన్ను అరగంట నిడివికి ఇంటికొచ్చి షూటింగు చేసుకుంటామంటూనే ...ముందుగా అమ్మకి కబురుచేసి తీసుకొచ్చి..నాపక్కనే కూర్చో పెట్టించి..చక్కగా టివిలో కనపడేలా ఏర్పాటు చేసి నా ఉన్నతికి అమ్మచేసిన కృషిని తెలిపి ఖుష్చేశాను..అప్పుడప్పుడే టెస్ట్ సిగ్నల్స్ ప్రారంభించిన ఆటివి వారు రోజుకు కనీసం పదిసార్లు చెప్పున నా ప్రోగ్రామ్ టెలెకాస్ట్ చేయడమూ..అది విజయనగరంలో నున్న మా అమ్మ ఆడబడచులు,తోటికో డళ్ళు..వాళ్ళపిల్లలు మాకంటే ముందుగాచూసి...అందులో అమ్మనే ముందుగుర్తుపట్టి ఫోన్లు చేసిచెబితే..అమ్మచెప్పగా నేనూ చివరికి చూసి తరించాను మామూలుగా కాదు!!  ఆతరువాత ఎంతోకాలం లేదు అమ్మ...!! అనారోగ్యకారణాలవలన జాబ్ మానేస్తూ..చివరిరోజు  మీటింగులో..మా అమ్మకి నా అవసరం ప్రస్తుతం చాలా ఉందని చెప్పి,,కాలక్షేపానికిలోటుండదని శలవుతీసుకున్న నేను...ఒక్కనెలరోజులు అమ్మని ఆనందింపచేశాను నా కంపెనీతో..అంతే...తిరిగిరానిలోకాలకు తరలిపోయింది సీతమ్మ...!తోచక...తరచితరచి కుమిలింది వసంతమ్మ.! అమ్మ కలకాలం ఉండాలనుకోవడం ఎంత పేరాశో.. ఉంటుందన్నిది ఒక కల.. పెద్ద కల. --అయ్యగారి వసంతలక్ష్మి

అమ్మ అన్న మాటే అమృత౦

  అమ్మ అన్న మాటే అమృత౦ అమ్మ అన్న మాటే అమృత౦. అ= ఆప్యాయత, ఆదరణ,అనురాగ౦, మ=మమత, మాధుర్య౦ ఇవన్నీ కలగలిస్తే అమ్మ ప్రతిరూప౦.అ౦దరిలా అమ్మ ప్రేమ పొ౦దలేదు.ఆఖర్న పుట్టిన నేను గార౦ ఎరగకపోయినా అమ్మ ప్రేమ విభిన్న౦గా పొ౦దాననిపిస్తు౦ది. నేను పుట్టేసరికి అమ్మ, అమ్మమ్మ,నాన్నమ్మ కూడా అయిపోయి౦ది. లాలి౦చడానికి సమయ౦ లేదు.అయినా అ౦దులోనే నా కోస౦ ఆరాట౦. చిన్నప్పుడు ఆవిడ మాగాయ ముక్కలు ఎ౦డపెడితే గున గున నడుచుకు౦టూ వెళ్ళి ఒక చె౦బెడు నీళ్ళు పోసానుట. రె౦డు వ౦దల మామిడికాయలు చచ్చి తొక్క తీసి ఊట౦తా పి౦డి ఎ౦డబెడితే అలా చేస్తే ఆవిడ మనస్థితి ఎలా ఉ౦టు౦ది? పెద్దయ్యాక అడిగాను కొట్టావా! అని. నవ్వి కొడితే ఆ నీళ్ళు బైటికి వస్తాయా! అని అడిగి౦ది. ఇ౦కో రోజు గాజుల మలార౦ వాడు వచ్చాడు. అక్కయ్యల కు గాజులు వెయ్యడానికి . అమ్మ గాజు గాజులు వేసుకునేది కాదు మడికి పనికిరావని.నా కెప్పుడూ రబ్బరు గాజులు వేయి౦చేది.ఆ రోజు పేచీ పెట్టి గాజు గాజులు వేయి౦చుకున్నాను వద్దన్నా వినకు౦డా. సాయ౦కాల౦ అయ్యేసరికి చిన్నన్నయ్య కొట్టడ౦ తో కొన్ని, ఆటల్లో పడిపోయి కొన్ని గాజులు విరిగి పోయాయి. నా బోడి చేతులు చూసి అమ్మ “వద్ద౦టే విన్నావా! పె౦కి తన౦,మొ౦డిపట్టు నువ్వూనూ” అ౦టూ ఒక్కటిచ్చి౦ది. ఏడుస్తున్న నన్ను చూసి గాజులు విరగ్గొట్టిన చిన్నన్నయ్య చ౦కలెగరేసాడు.ఏడుస్తూ నేల మీద నిద్రపోయాను. నాన్నగారు ఆఫీస్ ని౦చి వచ్చి నా క౦టి చారికలు చూసి ‘ఎ౦దుకేడ్చి౦ది’ అని అడిగారు. ‘కొట్టాను’ అ౦టూ జరిగిన స౦గతి చెప్పి౦ది. “పోనీ పావలా గాజులే కదా!పోయి౦ది రేపు మళ్ళీ గాజులు కొని వేయి౦చు అనవసర౦గా కొట్టావు” అన్నారు. “పావలా కోస౦ కాద౦డీ గాజుముక్కలు గుచ్చుకు౦టే” అన్న అమ్మ మాటలకు అప్పుడర్ధ౦ తెలియదు.అప్పుడు పావలా కూడా ఎక్కువే ఒక రోజు కూర వస్తు౦ది. మాగాయ ముక్కల సమయ౦ లో నా వయసు మూడేళ్ళు, గాజుల సమయ౦ లో ఐదేళ్ళనుకు౦టాను. అక్కయ్య కూతురికి మా బావ పట్టుపరికిణీ కొన్నాడని, నాకు కూడా కొనాలన్న తాపత్రయ౦. ఎలాగా? పొట్లాల కాగితాలు( అప్పట్లో సరుకులు కాగిత౦ పొట్లాలు కట్టేవారు).అవన్నీ కూడబెట్టి౦ది. అన్నయ్యలు అక్కయ్యల నోటు పుస్తకాలు స౦వత్సర౦ ఆఖరికి పోగేసి అన్నీ చెత్త కాగితాలకి వాడికి అమ్మితే డబ్బులొచ్చేవి. అలా ఎన్నాళ్ళు కూడబెట్టి౦దో పదిహేను రూపాయలు పెట్టి మెడ్రాస్ ని౦చి పట్టుపరికిణీ మామిడి ప౦డు ర౦గు మీద రె౦డు చేతుల వెడల్పు,ఉన్ననెమళ్ళ అ౦చుతో ఉన్నది తెప్పి౦చి, కుట్టి౦చి౦ది.అది వేసుకున్నప్పుడల్లా ఎక్కడ మాసిపొతు౦దో అని,వ౦ద జాగ్రత్తలు చెప్పేది.ఆ తరువాత అన్నయ్య దగ్గర అమ్మకు దూర౦గా పెరిగాను. మళ్ళీ కాలేజీ లో చేరడానికి రాజమ౦డ్రి వచ్చి అమ్మ ప్రేమ.కట్టుబాట్లలో పెరిగాను.రోజూ కాలెజీని౦చి వచ్చాక అమ్మతో ఆ సాయ౦కాల౦ పొట్టు పొయ్యి కూరుతూ కాలెజీ లో ఏ౦ జరిగి౦దో అమ్మతో ప౦చుకునేదాన్ని.మా కుటు౦బ౦లో కాలెజీ గడప తొక్కినదాన్ని నేనే మరి అ౦టే అమ్మ స౦తాన౦లో ఆడపిల్లనయి ఉ౦డి.ఇ౦చక్కా మా అమ్మ నా ఫ్రె౦డ్ లా అవన్నీ వినేది. మా కబుర్లయ్యాక టీ పెట్టమనేది. ఆ తరువాత పక్కి౦టి వాళ్ళ రేడియో లో లలిత స౦గీత౦ పాఠ౦ నేర్చుకునేదాన్ని.మా అమ్మఎ౦త ఆధునిక భావాలు కలదో చూడ౦డి. మా కాలేజ్ కో ఎడ్యుకేషన్ అబ్బాయిలు ఎలా పేర్లు పెట్టేవారు, ఎలా ఏడిపి౦చేవారూ అవన్నీ కూడా అమ్మతో ప౦చుకునేదాన్ని. అప్పటికి ఆమెకు అరవై వచ్చినా కు౦పటి సెగ తగిలితే ర౦గు తగ్గిపోతానని, కాల్చుకు౦టానని భయపడిపొయేది.క౦టి ఆపరేషన్ అయ్యి,మా మూడవ బావగారు పోయినప్పుడు కూడా నన్ను పొయ్యి దగ్గరకు ప౦పడానికి ఆమె మనసు ఒప్పేది కాదు.పెళ్ళి చూపులప్పుడు నాన్నగారు నల్లగా ఉన్నావు కాస్త పౌడర్ రాసుకో అ౦టె ఆవిడకు సర్రున కోప౦ వచ్చి నా పిల్ల నల్లగా ఉ౦ద౦టారా అ౦టూ నాన్నగారి తో దెబ్బలాడి౦ది.నా పెళ్ళిలో కూడా అమ్మ నా మూల౦గా దెబ్బలు తినడానికి స౦సిద్ధమయ్యి౦ది. నేను తెగి౦చి “ నన్ను కొట్ట౦డి మా అమ్మను కొట్టక౦డి  ఇలా ఐతే నేను పెళ్ళి చేసుకోను” అ౦టూ మొదటి సారి అమ్మకోస౦ నాన్నగార్ని ఎదిరి౦చాను. అప్పుడు కూడా అమ్మ క౦ట్లో నీళ్ళు బైటికి రాకు౦డా చేసుకుని, అలా వెళ్ళు నాన్నకెదురు చెప్తావా! అని కేకలేసి౦ది. పెళ్ళయిన కొన్నాళ్ళకు గర్భవతి నయ్యి నాలుగవ నెలలో అబార్షన్ అయితే ఆ స౦గతి తెలిసి పెద్దక్క దగ్గర ఏడ్చి౦దట. “నా చేత్తో దానికి పురుడు పుణ్య౦ ముచ్చట తీరుతు౦దో లేదో నేను లేకపోయినా నువ్వు ఆ ముద్దు ముచ్చటా జరిపి౦చు’ అని అక్క దగ్గర మాట తీసుకు౦దట. ఇలా అమ్మ గురి౦చి ఉన్నవి కొద్ది జ్ఞాపకాలైనా అన్నీ రాయలేను అన్నీ మధురాలే అమ్మ౦టే అ౦తే కదా!.ఇ౦తకీ చెప్పలేదు కదూ. అలా బె౦గ పెట్టుకున్న మా అమ్మ నాకు రె౦డు పురుళ్ళు పోయడమే కాకు౦డా మా అబ్బాయిల పెళ్ళి దాకా ఉ౦ద౦డోయ్.అదీ అమ్మ౦టే. అ౦దుకే అన్నారెవరో కవి “అమ్మవ౦టిది అ౦త  మ౦చిది అమ్మ ఒక్కటే” అని. -- సుజల గంటి (అనురాధ)- (ప్రముఖ రచయిత్రి)

గ్రేట్ వారియర్ మా అమ్మ

గ్రేట్ వారియర్ మా అమ్మ అమ్మో.. తప్పు చేస్తే అమ్మ చంపేస్తుంది అని మేము, భాను ( అక్కయ్య/పిన్ని/ అమ్మమ్మ/ అత్తయ్య) కోప్పడుతుందని బంధువులు అందరికీ తన ముందు, కానీ వెనక కానీ తప్పు చెయ్యాలన్నా, అబద్ధం చెప్పాలన్న భయం. ఎందుకంటే ఒప్పుకోదు. తప్పు చెయ్యనివ్వదు, ఛస్తే తప్పు చేయదు. “That is Bhanumathi.” మమ్మల్ని చాలా చాలా క్రమశిక్షణతో, అవసరమయితే శిక్షతో సరి చేసింది. లెఖ్ఖల్లో దిట్ట. చదువులో గ్రేట్.. విపరీతమయిన చురుకు. తను స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు రోజు..  నేను కడుపులో ఉన్నాను. ఆ రోజు సీమంతం.. గాజులు పెట్టించుకుంది, రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నేను పుట్టేనట. ఊరంతటికీ ఫస్ట్ వచ్చింది. స్కూల్ పీపుల్ లీడర్. జీవితం పట్ల విపరీతమయిన ఆసక్తి, అన్నీ తెలుసు కోవాలనే జిజ్ఞాస. బహుముఖ ప్రజ్ఞాశాలి. వీణ వాయించేది, బాగా చదువుకునేది, రచనలు చేసేది. మా అత్తగారి శిష్యురాలు వీణలో. వాళ్ళిద్దరి అనుబంధం ఒదినా- ,మరదళ్ళకి, గురు శుష్యులకీ ఆదర్శ ప్రాయం. చిన్నప్పుడు గురు దక్షిణ సమంగా ఇచ్చేమో లేదోనని 10 సంవత్సరాల క్రితం పగడాల ఉంగరం చేయించేరు గురువుగారికి. ముఖ్యంగా నా మొదటి వీణ గురువు మా అమ్మ గారు. అంతెందుకండీ! మా అమ్మ, నాన్నగారు వాళ్ళ గురువులకు (అయ్యగారి సోమేశ్వర రావు గారు, అయ్యగారి జయకుమారి గార్లకు) నన్ను గురుదక్షిణగా సమర్పించి...” నన్ను వాళ్ళతో సవ్యంగా నడచుకుని, చక్కగా వ్యవహరించి, కుటుంబాన్ని చక్కగా చూసుకుని మంచి పేరు తెచ్చుకోమని ఆదేశించారు.”. నేను అలాగే నడచుకున్నాను, నడచుకుంటున్నాను, నడచుకుంటాను. నేను గర్వ పడే విషయం ఏమంటే.. మా నాన్నగారు, “నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే జయలక్ష్మే నాకు మళ్ళీ కూతురుగా పుట్టాలి” అన్నారు. మా అమ్మ “ పిల్లలంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది, కానీ జయలక్ష్మి అంటే మాకు గౌరవంతో కూడిన అభిమానం.” అని చెప్పారు. అభిమానం నా హక్కు, గౌరవం నేను సంపాయించుకున్నది. నా జన్మ ధన్యం. కాకపోతే చివర్లో పులిలాంటి మా అమ్మ పిల్లిలా అయిపోయి, కొన్ని మర్చిపోయి, యోగినిలా నవ్వుతూ చూస్తూ ఉండి పోయింది మాట్లాడకుండా....... అటు వంటి స్థితిలో కూడా చదువుకి సంబందించినంత వరకూ పర్ఫెక్ట్. లెక్ఖలు ఎంత క్లిష్టమైనవైనా క్షణాల్లో చెప్పేది, ఇంగ్లీష్ లో అమ్మ, “సైట్ అర్ధం ఏమిటి అంటే ....సైట్ మూడు రకాలవి...అని.. Sight, site, cited”.. అని చెప్పేవారు, పద్యాలు చెప్పేవారు, అలానే ప్రైజ్ అంటే..”రెండున్నాయి praise, prize..అని, మొదటిది మనం చేసిన ప్రయత్నానికి ఎదురు వాళ్ళు ఇచ్చేది, రెండోది మనం హక్కుగా సంపాయించు కునేదీ” ట. బాగుందా? అలానే Pedestrians, Trespassers లాంటి క్లిష్టమైన పదాలకి అర్ధాలు చెప్పేరు, పోయే ముందు మూడు నెలల ముందు ఇదంతా... కొత్త కొత్త తెలుగు పద్యాలు ఎన్నో చెప్పి రాసుకోమన్నారు, కానీ అజ్ఞానం వల్ల రాసుకోవచ్చులే అనుకున్నా.. ఫలితం అర్ధంయ్యిందనుకుంటా..పాపం మా అమ్మ మొదటి నుండి ధైర్యంగా పరిస్థితులతో పోరాడింది, చివరికి మృత్యువుతో కూడా పోరాడి, పోరాడి .అలసి సొలసి ఓడిపోయింది తప్పని పరిస్థితులలో... అమ్మా! నిన్ను చూసి నాలుగు నెలలైంది...... --అయ్యగారి జయలక్ష్మిః

తలవని రోజుందా అమ్మ

  తలవని రోజుందా అమ్మ నేను పదేళ్ళ పాప మురళిఅన్నయ్య ఫ్రెండ్స్ తో బొంగరాలాట ఏడుపెంకులాట ఆడుకొని కను చీకటిపడేటప్పుడు యింట్లో అడుగు పెట్టింది . అమ్మ ఎందుకో కోపంగా వుంది . పిల్లిలా వాకట్లొకెళ్లి కాళ్లు కడుక్కొని పుస్తకాలు ముందు వేసుకొని చదువు కోడానికి కూర్చుంది . అమ్మ భోజనానికి పిలిచేదాకా చదువుకుంది. భోజనాలదగ్గర " రేపటి నుంచి నువ్వు మొగ ఆటలు ఆడకూడదు, కున్ని, మినొతి, విజయలతో ఆడుకోవాలి " అమ్మ శాసనం . " మగ ఆటలా ? ", ఆటలలో కుడా లింగ బేధం ఉంటుందని తెలీని పాప సందేహం . " అంటే చింతపిక్కలాటలు, గచ్చకాయలు ఆడుకోవాలి నాతో సమానంగా బొంగరాలు ఆడకూడదు అదీ సంగతి , వీధినిండా ముగ్గులు కావాలంటే పెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు" సందేహ నివృత్తి చేసేడు మురళి. మురళి గొంతులో హేళన ఉందేమో అనే అనుమానం వచ్చింది పాపకి. అమ్మ ఆ యింటి నియంత, వొక నిర్ణయం తీసుకుంది అంటే మరి దాన్ని మార్చే ప్రసక్తే లేదు. అయినా ఏదో ఆశ. అందుకే నాన్నగారివైపు ఆశగా చూసింది. " మరీ నోటిస్ యివ్వకుండా యిలా ఆర్డరు వేస్తే ఎలా ? వో పదిరోజులు యీ మొగ ఆటలు ఆడేసి, సైకులు తొక్కేసి అప్పుడు మానేస్తుందిలే ? కదమ్మా పాపా, తరవాత అమ్మ దగ్గర కుట్లు అల్లికలు, వీణ నేర్చుకో ఏం " నాన్నగారు మరో పదిరోజుల గడువు యిప్పించేరు. ఆటలకు పంపనప్పుడు అమ్మలో నియంతను చూసింది, కుట్లు, అల్లికలు, సంగీతం నేర్చుకునే టప్పుడు గురువుని చూసింది. బుట్ట చేతుల గౌను, దొంతుల గౌను, పంజాబీ డ్రెస్స్, నిండా కుచ్చిళ్ళ పరికిణి, మూడు నాలుగు రంగుల బట్టలతో గౌను కుట్టినప్పుడు అమ్మ వో ఫాషన్ డిజైనర్." పని ముద్దా, భాగ్యం ముద్దా అని "  అంటూ సమర్దవంతం గా అన్ని పనులు స్వయంగా చేసుకోవాలని తాను చేసుకుంటూ పాపకి, కోడళ్ళకి సలహాలిస్తున్నప్పుడు మార్గదర్శి. పదమూడేళ్ల పాపకి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపుతూ అక్కడ ఎలా మసలుకోవాలో చెప్తున్నప్పుడు అమ్మ వో స్నేహితురాలు. పదహారేళ్ళ పాప తల్లయితే పనిమనుషులు దొరకని ఒడ్డిదేశంలో అమ్మ ఆయాగా పురిటి, ' చెత్త ' చేతులతో శుభ్రం చేసింది, పురిటి బట్టలు చాకలి కారంలో ఉడక బెట్టి ఉతికిన అమ్మ వో చాకలి, పాటలు పాడుతూ పసివాడికి లాల పోసి జోల పాడిన నాతల్లి అమృతవల్లి, అనురాగాల తల్లి. యింటి పని, వంట పని, పిల్లల చదువులు, బయట పనులు అన్ని సమర్ధవంతంగా చేసుకో గలిగే శక్తి, దైర్యం యిచ్చిన శక్తి స్వరుపిణి అమ్మే. పిల్లలని, సామాను తీసుకొని రెండు ట్రైన్స్ మారి మూడురోజుల ప్రయాణం సమర్దవంతంగా చెయ్యగలిగే దైర్యాన్ని యిచ్చినదీ అమ్మే. యిక్కడ మరో అమ్మని గురించి కుడా చెప్పుకోవాలి, ఆ అమ్మ పాపని కన్న అమ్మ. యీ అమ్మ పాప పదమూడో యేట అత్తగారిగా పరిచయమై పాపని లక్ష్మిగా చేసిన అమ్మ. అప్పటి నుంచి యిప్పటి వరకు లక్ష్మి మీద యీగని కుడా వాలనివ్వకుండా చూసుకున్న అమ్మ. యింట్లో అడుగు పెట్టిన మొదటి రోజు లక్ష్మి భర్తకి " లక్ష్మి కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకో, దాని కంట్లో నీళ్లు చూసేనా నీ నడ్డి పెట్ల కొడతా " అని వార్నింగ్ యిచ్చిన అత్తమ్మ. లోక ధర్మం ప్రకారం అత్తమ్మలో అమ్మని చూసుకుంటూ లక్ష్మిగా మారిన పాప తల్లిని తలవని రోజుందా ? --కర్ర నాగలక్ష్మి

అమ్మా నేనూ

  “బి.పీ. మాత్ర వేసుకున్నావా?” నా దగ్గర పదిరోజులు వుండటానికి వచ్చిన అమ్మను అడిగే మొదటి ప్రశ్న! “వేసుకున్నా..”అనేదే ఎప్పటి సమాధానం.... “రాత్రి నిద్రపట్టదు..నిద్రమాత్ర వుందా?” పడుకునేముందు అమ్మ అడిగితే “రోజూ నిద్రమాత్ర వేసుకో కూడదు అమ్మా” “అదికాదే..అర్ధరాత్రి బాత్ రూం వెడితే కళ్ళు తిరిగినట్టవుతుంది. మాత్ర వేసుకుంటే నిద్రపోతా కదా..” కళ్ళు తిరుగుతున్నాయి అంటే బి.పీ ఎక్కువ వుండవచ్చు. తొంబై ఏళ్ల అమ్మకు వున్న ఏకైక ప్రాబ్లెం బీపీ... “రేపు డాక్టర్ను పిలిపిస్తా ..ఈ రోజుకు ఈ మాత్ర వేసుకో “ అని ఒక రేస్టిల్ మాత్ర ఇచ్చా. మా పల్లెలో R.M.P.డాక్టర్ ఎప్పటిలాగే వచ్చి అమ్మ బిపీ చెక్ చేసి “ కొంచం ఎక్కువగానే వుంది ఏమి మాత్రలు వేసుకుంటూ వున్నారమ్మా”అని అడిగితె అమ్మ తన బ్యాగ్గు తీసి అందులో ఒక ప్లాస్టిక్ కవరులో మడిచి పెట్టి వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపితే అది నేను తీసుకుని చూసి”ఇది చాలా పాతది..ఇవే వాడుతున్నవా? ఈ మద్య డాక్టరు దగ్గరికి వెళ్ళలేదా? అసలు మాత్రలు వేసుకుంటూ వున్నావా.. లేదా?” గట్టిగా అంటున్న నన్ను దీనంగా చూసే అమ్మ...నాకర్థం అయ్యింది.. “మీరు రాసివ్వండి డాక్టర్, నేను తెప్పిస్త్తాను..” అన్నాను. మాత్రలు అయిపోయినా తమ్ముడిని అడగదు అమ్మ. ఎన్ని రోజు లైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని కూడా అడగదు. తొంబై ఏళ్ళ అమ్మకు డాక్టర్ కు చూపించడం అవసరం అనిపించదు తమ్ముడికి. “ఏం ఎందుకు అడగవు? రేప్పొద్దున నీవు మంచాన పడితే ఎవరు చూస్త్తారు? మందులు సరిగ్గా తీసుకోవాలి అమ్మా” నేను ఎంత మాట్లాడినా అమ్మది మౌనమే... తనను ఏమైనా అన్నా భరిస్త్తుంది కానీ తమ్ముడిని ఏమీ అనకూడదు అమ్మకు...కారణం తమ్ముడికి ఉద్యోగం లేదు కనుక నెలసరి ఆదాయం లేదు..పొలాలు ఎన్ని వున్నా రాయలసీమలో పండని భూములే..వాన చినుకు కోసం ఆకాశం వైపు ఎప్పుడూ ఎదురు చూపులే..అందుకే తన ద్వారా కొడుకు కి కష్టం కలగకూడదు అనే ఆలోచిస్త్తుంది తప్ప తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు. అదే నా బాధ ఎప్పుడూ... పదిరోజులు గడవగానే “వూరికి పోతా” అనేది. “ఇక్కడ హాయిగా వున్నావు..వుండు... పోవచ్చులే” నా సమాధానం ఎప్పుడూ నచ్చదు ఆమెకు. “ఆడబిడ్డ దగ్గర ఎన్ని రోజులైనా ఎలా వుంటాను?” “ఏం నేనూ నీ కడుపునా పుట్టిన దాన్నే..నా దగ్గరా వుండవచ్చు..” “అట్లా అనకు...ఎక్కడి వాళ్ళు అక్కడే వుండాలి” “ఇలా లాజిక్కులు మాట్లాడకు” నాకు జవాబు చెప్పలేక అక్కడనుండీ కదిలింది అమ్మ... రిటైర్ అయ్యాక పల్లె చేరిన నాకు...అమ్మను దగ్గర వుంచుకోవాలనీ...ఆ వయసులో అమ్మకు సుఖం ఇవ్వాలని ఏవేవో కోరికలు. కానీ కొద్ది రోజులు గడవగానే కొడుకు మీదే లోకం అమ్మకు.. చివరకు నేనుగా పంపనని నాకు తెలియకుండా  దొంగగా పెరట్లోకి వెళ్లి తమ్ముడికి ఫోన్ చేసేది. వాడు మరుసటి రోజు వచ్చి అమ్మను తీసుకేడతా అంటే వాడిని చూసి అమ్మ కళ్ళల్లో ఎంత సంతోషమో!!....నిస్సహాయత నా అధీనం అప్పుడు... ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో చూసుకున్నా అమ్మకు తమ్ముడి మీదే లోకం అని అసూయ నాకు...ఒక్కసారైనా అమ్మ “నాకిక్కడ బాగుంది ఇక్కడే వుంటా “అని అనదే అని బాధ. అదే అంటే “మీది సుఖమయమైన జీవితం..పాపం వాడికే కష్టాలు” జాలి ప్రేమా అంతా  వాడి దేనా??? చివరకు తమ్ముడి దగ్గరే ఒక రోజు పొద్దున్న కాఫీ తాగి లేచి వెళ్ళబోతూ కళ్ళు తిరిగి కిందపడ్డ అమ్మ లేవలేకపోయింది. పర్రీక్షల తరువాత తోడ ఎముక విరిగిందనీ ఆపరేషను అవసరమని.... “ఆపరేషను చేస్తే ఆరునెలలు బెడ్ మీద వున్నా లేచి తిరగ వచ్చు..లేదా పర్మనెంటు గా బెడ్ మీద వుండాల్సిందే “ అన్న డాక్టర్ మాటలు విన్నప్పుడు. అమ్మ ఏమి అలోచించి వుండవచ్చో ఉహించగలను. ఆపరేషను చేసుకుని తొందరగా నడవాలి  అనుకుని వుంటుంది. మరి అనేస్తీశియా ఇచ్చి ఆపరేషను జరిగాక , ఆపరేషన్ సక్సెస్ అన్నాక, ఆరు గంటల తరువాత కళ్ళు తెరవక పోయినా చేతులు కదిలి ఆక్సిజెన్ ట్యూ బులు  పెరికి ‘ఉహ్’ అంటూ చివరి సారిగా గాలిని వదిలి నిశ్చలంగా అయి ప్రశాంతంగా కన్ను మూసింది అమ్మ....అమ్మ బుర్రలో ఏమి ఆలోచనలు వచ్చి వుండవచ్చు? తాను పడక మీద వుంటూ కొడుకు కష్టం కలిగించ కూడదు అనుకుని వుంటుంది.... కొడుకు ఇంటనే తనువు చాలించాలనీ అనుకుని వుంటుంది.... ”ఎంతసేపూ కొడుకేనా అమ్మా ...నాగురించి ఆలోచించావా...”బాధగా మూలిగింది నా మనసు రోజు.. ఇప్పుడు ఆలోచిస్తే.... జీవితంలో అనిర్వచనీయమైన అనురాగాన్ని పంచి ఇచ్చిన అమ్మ,తమ్ముడి పట్ల అమితంగా ప్రేమ చూపుతుందని ఎందుకు అనిపించేది నాకు? ఆర్థికంగా కొడుకు బాధల్లో వున్నదని తల్లడిల్లిపోయిన ఆ మాత్రుహృదయాన్నిఎందుకు అర్థం చేసుకోలేదు నేను??? “అమ్మా క్షమించు” మనస్పూర్తిగా నమస్కరించాను అమ్మ ఫోటోకు. నవ్వుతూవున్న అమ్మ ఆశీర్వదించి నట్టు అనిపించింది... --లక్ష్మీ రాఘవ

అమ్మకి కానుక

అమ్మకి కానుక మా అమ్మ మంచితనం గురించి ఏం చెప్పను? అమ్మంత మంచిది అమ్మ. పేరు సత్య వాణి . ఆవిడ ఎక్కువ చదువుకోలేదు. .కానీ ఆవిడకున్న తెలివి తేటలు సమర్ధత ఇంతా అంతా కాదు. ఆ తరం లో ఏంతో మంది మధ్య తరగతి ఇల్లాళ్ళ లాగా మా అమ్మ కూడా మాలతి చందూర్ గారికి వీరాభిమాని. పొద్దున్న లేచి మాలతీ చందూర్ ని తలచుకోకుండా వుండేది కాదు. ప్రతి విషయంలోను మాలతి గారు అలా చెప్పారు. మాలతి గారు ఇలా చెప్పారు అనుకుంటూ ఆవిడ చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటించేది అమ్మ. ఆ రోజుల్లో మాలతి చందూర్ గారి పేరు మాఇంట్లో వాసాలకు పెండేలకు పట్టిపోయింది. కాలం గడిచింది .నేను కలం పట్టి రచయిత్రిని అయ్యాను. మా శ్రీవారి ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్లాం .  కాస్త ఇల్లూ వాకిలీ  సర్దుకుని  టెలిఫోనే డైరెక్టరీ నంబర్ వెతికి మాలతి చందూర్ గారికి ఫోన్ చేసాను. అప్పుడు ఆవిడ ఇంట్లో లేరు..ఆవిడ క్లర్క్ నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరునాడు మాలతి గారిదగ్గర్నించి ఫోన్ . మొదటి సారి మాట్లాడినా ఎన్నో ఏళ్ళనించీ పరిచయం వున్నట్లు అప్యాయంగా మాట్లాడటం  మాలతి గారి ప్రత్యెకత. ఆ రోజే అమ్మకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాను. బొలెడంత  సంబర పడిపోయింది అమ్మ. ఆతరువాత మాలతి గారిని చాలాసార్లు కలుసుకున్నాను. ఆ రోజుల్లోనే అమ్మ చెన్నై వచ్చింది. అప్పటికి నాన్నగారు వెళ్ళిపోయారు. మరికొద్ది రోజుల్లో అమ్మ70 వ పుట్టిన రోజు వస్తోంది. అమ్మా  నీకు ఏం కొనను?ఏం కావాలి? అని అడిగాను, నాకేం వద్దు నీకు వీలయితే  నన్ను  మాలతీ చందూర్ గారి దగ్గరకి తీసుకువెళ్ళు అని అడిగింది. మాలతి గారికి ముందుగా చెప్పి మా వెహికిలూ డ్రైవర్ వగైరా జంజాటాలు పెట్టుకోకుండా అమ్మ నేను ఆటోలో వెళ్లాం. తన 70 వ ఏట తన అభిమాన రచయిత్రిని కళ్ళారా చూసుకుంది అమ్మ. అప్పుడు ఆవిడ కు కలిగిన ఆనందం వర్ణనాతీతం .  నాన్నగారు పోయాక  అంత కాలానికి మళ్ళీ  అమ్మ మొహం లో వెలుగు కనిపించింది. పరిచయం చేయటంతో నా పని ముగిసింది. ఇక వాళ్ళిద్దరూ  ఎక్కడికో వెల్లిపొయారు. ఎప్పటెప్పటి  సంగతులో గుర్తు చేసుకున్నారు . రెండు గంటలు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. ఆటో ఎక్కగానే అమ్మ నా చెయ్యి పట్టుకుంది ..  నాకెంతో ఆనందం గా వుంది మాలతి గారిని చూస్తానని కల్లో కూడా అనుకోలేదు . ఇవ్వాల్టికి నా కోరిక తీరింది ,అదికూడా ఏ funtion  లోనో కలిసి  హడావిడిగా  రావటం కాదు . సావకాశం గా మాట్లాడాను అని మురిసి పోయింది. ఆ మర్నాడు కొరియర్  లో హృదయ నేత్రి  పుస్తకం పంపించారు  మాలతి చందూర్ గారు.  అది అందుకుని  లాటరీ  వచ్చినంత సరదా పడింది అమ్మ. ఆ తరువాత  నాలుగేళ్ళకు అమ్మకి కాన్సర్  వచ్చింది. ఎక్కువ బాధ పడకుండానే  వెళ్లి పొయింది. పోతానని తెలిసిపోయింది అమ్మకు. తన కళ్ళు దానం చెయ్యమని చెప్పింది చెశాం. ఇద్దరికి చూపు వచ్చిందిట. అమ్మకి ప్రకృతి  అంటే ఇష్టం . గుళ్ళు గోపురాలు చూడటం ఇష్టం .. నేను ఎక్కడికైనాటూర్  వెళ్లి రాగానే అక్కడి వివరాలు అడిగి తెలుసుకునేది .నువ్వు చెప్తే నేను స్వయంగా చూసి నట్లు ఉంటుందమ్మా  అనేది ' పోయేముందు నేను వెళ్ళిపోతున్నా  .ఎక్కడికి వెళ్ళినా ఆ అందాలన్నీ నా కళ్ళతో చూడు  అని నాకో బాధ్యత అప్పగించింది అమ్మ కళ్ళు ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఎక్కడ ఏ అందమైన దృశ్యం చూసినా  అమ్మను తల్చుకుని ఆమె కళ్ళతో మరోమారు చూస్తాను.  మరి కూతురిగా నా బాద్యత నిర్వర్తించాలిగా ! .......పొత్తూరి విజయ లక్ష్మి.

'మౌనం' మంచిదే

'మౌనం' మంచిదే 1)"రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం మవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం. 2) మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్  బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం - ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట. 3) మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు,  అరుపులు... అక్కడితో అయిపోతుందా? అవన్నీమనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా? 4) మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. 5) ఉదయం లేచిన దగ్గుర్నుచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై.. ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది.  అదే" మౌనం". ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది  చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు. ఇక ఇప్పటికైతే నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నా. -రమ

ఆమె ‘మదర్ ఆఫ్ ద ఇయర్’

ఆమె ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అమ్మ ఎవరికైనా అమ్మే. తన బిడ్డ మాత్రమే బాగుండాలి... వేరే తల్లి కన్న బిడ్డలకు ఏమైనా పర్లేదు అని ఏ అమ్మ అయినా అనుకుందీ అంటే, ఆమె అమ్మతనంలో కమ్మదనం లేనట్టే భావించాలి. అయితే అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మ తన కొడుకు మీద అతిగా ప్రేమ పెంచేసుకోలేదు. అతను తప్పు చేసినా వెనకేసుకు రావాలని ప్రయత్నించలేదు. అతను తప్పు చేస్తున్నప్పుడు నిలదీసింది. ఇతరులకు హాని చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకుంది. అమ్మ అంటే ఎలా వుండాలో ప్రపంచానికి చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలుస్తున్నారు. అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఇటీవల ఒక విద్యార్థి పోలీసుల కస్టడీలో చనిపోయాడు. ఆ విద్యార్థిని పోలీసులు అన్యాయంగా చంపేశాడని స్థానికులు గత కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అయితే మంగళవారం వరకూ ఆ ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి.  బుధవారం నాడు ఆ మరణించిన విద్యార్థి అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా శాంతియుత నిరసన ప్రదర్శన జరుగుతూ వుండగా కొంతమంది కుర్రాళ్లు ముఖానికి ముసుగులు వేసుకుని విధ్వంసకాండకు దిగారు. ఈ అల్లర్ల కారణంగా పరిస్థితులు చెయ్యి దాటిపోయి, పోలీసు ఫైరింగ్ జరిగే ప్రమాదం వుందని అక్కడున్నవారందరూ భయపడిపోయారు. అయితే ఇదే ప్రదేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ‘టోయా గ్రాహమ్’ అనే మహిళ చూపులు ముఖం నిండా ముసుగు కప్పుకుని, పోలీసుల మీదకు రాళ్ళు విసురుతున్న ఒక యువకుడి మీద నిలిచాయి. ఆ ముసుగులో వున్నదెవరో ఆమె కనిపెట్టేసింది. ఎందుకంటే, ఆ యువకుడిని కన్నది తానే కాబట్టి. ఆ ముసుగు యువకుడు తన కుమారుడే అని గ్రహించిన ఆ అమ్మ మనసు ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే ఆ యువకుడి వెంట పడింది. తన తల్లి తనను పట్టుకుని తన ముసుగు తొలగిస్తుందని భయపడిన ఆ యువకుడు ఆమె నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె పట్టు విడవకుండా తన కొడుకు వెంట పరిగెత్తి అతన్ని పట్టుకుంది. అతని ముసుగు తీసి, ఆ చెంపా, ఈ చెంపా వాయించేసింది. తల్లికి దొరికిపోవడంతో ఆ యువకుడు శాంతించి అదుపులోకి వచ్చాడు. మిగతావారు కూడా పారిపోవడంతో అల్లర్లు అదుపులోకి వచ్చి పోలీసు కాల్పులు తప్పాయి. ఈ ఘటనను ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో చూస్తున్న దాదాపు ఐదు లక్షల మంది ప్రేక్షకులు చూశారు. ఆ మహిళ వెంటాడి పట్టుకున్నది తన సొంత కొడుకునే అని తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ ఘటన తర్వాత టోయా గ్రహమ్ మాట్లాడుతూ, తన కొడుకు ముసుగులో వున్నప్పటికీ తాను గుర్తించానని, అల్లర్ల కారణంగా అతని జీవితం నాశనం కావడంతోపాటు పోలీసులు కాల్పులు జరిగితే ఎంతోమంది మరణించేవారు. ఒక తల్లిగా నా బిడ్డ ఎలా సంతోషంగా వుండాలని కోరుకుంటానో, మిగతా తల్లులు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తాను అని చెప్పింది. నా కొడుకు దారి తప్పాడు... ఇప్పుడు అతన్ని సరైన దారిలో పెట్టే పనిలో నిమగ్నమవుతాను అని చెప్పింది. తన చర్యలతో, తన మాటలతో టోయా గ్రహమ్ అమెరికా ప్రజలకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఆమెను అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలవటం మొదలుపెట్టారు.

డస్ట్ బిన్ 'బెస్ట్ బిన్' అవ్వాలి

డస్ట్ బిన్ 'బెస్ట్ బిన్' అవ్వాలి ఇంటి అందం పెంచే వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయా అని వెదికే వాళ్ళ కోసం... ఈ సమాచారం... ఇంట్లోని చెత్తని బయట పడేసే వరకు దానిని అందంగా ఎలా స్టోర్ చేయచ్చో తెలుసా... మాములు బుట్టల నుంచి రంగు రంగుల డస్ట్ బిన్స్ వరకు ఎన్నో చూసారు కదా... ఇప్పుడు పిల్లల రూమ్ కోసం వాళ్ళు ఇష్టపడే రంగులలో, డిజైన్స్ లో ఎన్నో వెరైటీ డస్ట్ బిన్ లు మార్కెట్ లో వున్నాయి. అలాగే లివింగ్ రూమ్ కోసం కాస్త హుందాగా ఉండేవి, డైనింగ్ రూమ్ కోసం ఆకర్ష్యనీయం గా ఉండేవి...ఇలా మన అవసరాలు, ఇష్టాలు బట్టి చెత్త వేసే డబ్బాలని  ఎంచుకుని కొనుక్కోవచ్చు... ఖరీదయిన ఫర్నిచర్ , అందమయిన ఇంటీరియర్, కళ్ళు చెదిరే డెకరేషన్... వీటికి ఎక్కడా తగ్గకుండా ఓ డస్ట్ బిన్ కూడా చేరితే... ఇంకేం వుంది చెప్పండి... మీ ఇల్లు అందంగా మెరిసిపోతుంది. పిల్లలకోసం -రమ

చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం

చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు గడియారంలో ముల్లుతో సమానంగా పరుగులు పెట్టే మహిళలతో కాస్త మీ గురించి మీరు పట్టించుకోండని ఎవరైనా చెబితే, ఆ చెప్పినవాళ్ళ మీద బోలెడంత కోపం వస్తుంది. ఉరుకులు, పరుగులు పెడుతూ, అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ అన్ని పనులు సమర్థవంతంగా చేయాలనీ, అందరినీ తృప్తిపరచాలనీ హైరానా పడిపోతూ, ఈ హైరానాలో మనకోసం మనం ఆలోచించుకునే తీరిక, కోరిక కూడా వుండదు. కానీ మనకోసం మనం శ్రద్ధ చూపకపోతే ఎలా? అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యం చురుకుదనాన్ని అందిస్తుంది. సో... అందంగా, ఆరోగ్యంగా వుంటే ఆత్మవిశ్వాసం నిండుగా, మెండుగా వుండి, అది మన ప్రవర్తన తీరులో బయటపడుతుంది. అందుకు పెద్దగా సమయం కూడా అక్కర్లేదు. రోజు మొత్తంలో మన రొటీన్‌కి చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది. * మొట్టమొదటగా తప్పనిసరిగా చేయాల్సింది... ఉదయం నిద్ర లేస్తూనే హడావిడిగా మంచం దిగి పని ప్రారంభించకుండా ఓ 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఎక్సర్‌సైజులు వంటివి చేయడానికి టైమ్ వుంటే సరే, లేకపోతే కనీసం శ్వాస ప్రక్రియ పైన దృష్టి పెట్టినా చాలు. ఇక మరో ముఖ్య విషయం... పరగడుపునే రెండు మూడు గ్లాసుల నీటిని తాగడం ద్వారా శరీరం మరింత కాంతిని సంతరించుకుంటుంది. అలాగే రోజులో వీలు చిక్కినప్పుడల్లా మంచి నీటిని తాగటానికి ప్రయత్నించండి. ఇది పెద్ద విషయమా అనుకోకండి. రోజు మొత్తంలో ఎంత మంచినీరు తాగుతున్నారో ఒక్కసారి గమనించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే అందానికి, ఆరోగ్యానికి కూడా మంచింది. * చాలామంది బ్యూటీ పార్లర్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంతమాత్రాన మనపై మనం శ్రద్ధ పెట్టకుండా ఉంటే ఎలా? చిన్న చిన్నవే... ఉదాహరణకి స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆయిల్ వేసుకోవడం, మంచి బాడీ లోషన్ అప్లయ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే చాలు... వయసు ప్రభావం కనిపించకుండా చూసుకోవచ్చు. మరో విషయం... ఎండలోకి వెళ్ళేముందు నన్‌స్క్రీన్ లోషన్ వంటివి అప్లయ్ చేసుకోవడం, చలువ అద్దాలు వాడటం వంటివి చాలా చిన్న విషయాలే. కానీ, చాలామంది శ్రద్ధ పెట్టని విషయాలు కూడా. * సాధారణంగా బయటి నుంచి ఇంట్లోకి అడుగు పెడుతూనే చేయాల్సిన పనులని తలుచుకుంటూ పనిలో పడతాం. కానీ, ఇంటికి రాగానే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుని, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. బయట పొల్యూషన్ ప్రభావం మన ముఖంపైనుంచి పోవడానికి. ఇక వారానికి ఒక్కసారైనా ఒక చెంచా తేనెలో కొంచెం వెనిగర్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగి చూసుకోండి. అట్టే సమయం పట్టదు సరికదా, మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇక ఆడవారిలో ఒత్తిడిని, వయసుని బయటపెట్టేవి కళ్ళకింద నల్లటి చారలు. రోజూ పడుకునే ముందు రెండు కీరా ముక్కల్ని కళ్ళపై పెట్టుకునే అలవాటు చేసుకుంటే చాలు నల్లటి వలయాలు కొన్నాళ్ళలో మాయమవటానికి. * రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేశాక నిద్రకి ఉపక్రమించే ముందు మీకోసం మీరు ఓ 5 నిమిషాలు ఇచ్చుకోగలిగితే చాలు. గోరువెచ్చని నీటిలో పాదాలని ఉంచి, మీకు ఇష్టమైన పుస్తకాన్ని తిరగేయండి. రోజంతటి శ్రమని మర్చిపోవచ్చు. ఇక ఆఖరిది, ముఖ్యమైనది... తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఏ ఫేస్‌ప్యాక్‌లూ, మేకప్‌లూ అది ఇచ్చే ఆరోగ్యాన్ని, అందాన్ని అందించలేవు నిజానికి.  ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ చాలా చిన్న చిన్నవే. కానీ, మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టనివి కూడా. ఈ చిన్న జాగ్రత్తలతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రోజూ చేయగలిగితే అలవాటుగా కూడా మారుతుంది.. ఏమంటారు? -రమ

ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త సుమీ...

  ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త సుమీ... * ఆడవారికి బాధ్యతలు ఎక్కువ. సమాజంలో నిర్వహించాల్సిన పాత్రలూ ఎక్కువే. దానితోపాటు ఒత్తిళ్ళూ అధికమే. అందులోనూ ఇంట్లో ఎవరికన్నా ఏపాటి నలతగా వున్నా వారితోపాటు రాత్రింబవళ్ళు ఉంటూ వారికి స్వాంతనని కలిగించేందుకు ప్రయత్నించడంలో మరీ ఒత్తిడికి గురవుతుంది స్త్రీ. అయితే ఈ ఒత్తిళ్ళని కూడా భరిస్తూ తన బాధ్యతలని సక్రమంగా, సరైన సమయంలో పూర్తి చేయడానికి అలవాటుపడిపోయింది. దానితో తన గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి, తనలోని మానసిక ఆందోళన గురించి ఏమాత్రం ఆలోచించదు. అదిగో అలా తనని తాను నిర్లక్ష్యం చేసుకునే ఆడవారిని హెచ్చరిస్తోంది ఇటీవల హార్వర్డ్ మెడికల్ స్కూలు వారు వెలువరించిన పరిశోధన ఫలితం. * ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సేవలు చేయడంలో ఆడవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంటుంది అంటున్నారు పరిశోధకులు. ఆ ఒత్తిడి ఆడవారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని కూడా వీరు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా 65 సంవత్సరాలు పైబడ్డ స్త్రీలని, వారి జీవన శైలిని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులని, వారి వైద్య రికార్డులని పరిశీలించారు. ఒకరు ఇద్దరు కాదు... సుమారు ఐదు లక్షల మందిని పరిశీలించిన ఈ పరిశోధకులు చివరికి తేల్చిన విషయం... కుటుంబంలోని వారి అనారోగ్యం స్త్రీలని తీవ్ర ఒత్తిడికి గురిచేసి, వారి ఆయుష్షుపై ప్రభావాన్ని చూపిస్తుంది అని. అదీ దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారి మంచి చెడ్డలు చూడటంలో అంతర్లీనంగా ఉండే ఎన్నో విషయాలు ఆ ఒత్తిడికి కారణం అవుతాయిట. * వయసు మళ్ళినవారు, మంచిపై ఉన్నవారి ఆలనా పాలనా చూడటంతో తమపై తాము శ్రద్ధ పెట్టకపోవటం, పూర్తిగా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక కారణం అయితే, పోషకాహారం తీసుకోకపోవడం, సంరక్షణ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కువ శ్రమపడటం వంటివి మరో కారణం. ఈ అధ్యయనంలో భాగంగా వివిధ స్త్రీల వైద్య రికార్డుల్ని పరిశీలించినప్పుడు కేన్సర్ వంటి అనారోగ్యంతో బాధపడేవారు ఇంట్లో వున్నవారికంటే తీవ్రమైన అంగవైకల్యానికి గురైన వ్యక్తులు ఇంట్లో వున్న వారు ఎక్కువ ఒత్తిడికి గురైనట్టు తేలింది. శారీకర శ్రమ, సామాజిక ఒత్తిళ్ళు వంటివి కారణం కావచ్చంటున్నారు పరిశోధకులు. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తుల సంరక్షకులకి ఈ ఒత్తిడి మరీ అధికమట. * ‘డిమెన్షియా’ అంటే మతిమరుపు తదితర మానసిక రుగ్మతల బారిన పడిన వారిని సంరక్షించడంలో సాధారణ స్థాయి కంటే ఒత్తిడి, వేదన అధికంగా వుంటాయిట. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థను కాపాడే తెల్ల రక్తకణాలు చురుకుదనాన్ని కోల్పోవడం గమనించారు. దానితో అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు గుర్తించారు. ఇలా రోగుల సంరక్షణలో ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్ళు దాగున్నాయని, ఈ విషయంలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. * ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది. అయినవారి బాధ చూడటం కష్టమే. వారిని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమని చెబుతున్నారు పరిశోధకులు. ముందుగా పరిస్థితులని యథాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనని దగ్గరకి రానీయకపోవడం, మంచి ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకోవడం. అందుకోసం ఇంట్లో మిగిలిన సభ్యుల సహాయ సహకారాలని కూడా కోరటం, ఒత్తిడిగా అనిపించినప్పుడు రిలాక్స్ అయ్యే టెక్నిక్స్‌ని పాటించడం, వీలయితే ఓ గంట ఒంటరిగా ఉండటం వంటివన్నీ అనారోగ్యపు బారిన పడిన వారిని సంరక్షించడంలో మనం అనారోగ్యానికి గురికాకుండా కాపాడే చిన్న జాగ్రత్తలుట. ఎంతైనా మనం ఆరోగ్యంగా వుంటేనే కదా అందరినీ చక్కగా చూసుకోగలిగేది. కాబట్టి కొంచెం ధైర్యంగా, మరికొంచెం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. -రమ