'మౌనం' మంచిదే

'మౌనం' మంచిదే 1)"రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం మవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం. 2) మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్  బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం - ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట. 3) మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు,  అరుపులు... అక్కడితో అయిపోతుందా? అవన్నీమనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా? 4) మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. 5) ఉదయం లేచిన దగ్గుర్నుచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై.. ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది.  అదే" మౌనం". ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది  చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు. ఇక ఇప్పటికైతే నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నా. -రమ

ఆమె ‘మదర్ ఆఫ్ ద ఇయర్’

ఆమె ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అమ్మ ఎవరికైనా అమ్మే. తన బిడ్డ మాత్రమే బాగుండాలి... వేరే తల్లి కన్న బిడ్డలకు ఏమైనా పర్లేదు అని ఏ అమ్మ అయినా అనుకుందీ అంటే, ఆమె అమ్మతనంలో కమ్మదనం లేనట్టే భావించాలి. అయితే అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మ తన కొడుకు మీద అతిగా ప్రేమ పెంచేసుకోలేదు. అతను తప్పు చేసినా వెనకేసుకు రావాలని ప్రయత్నించలేదు. అతను తప్పు చేస్తున్నప్పుడు నిలదీసింది. ఇతరులకు హాని చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకుంది. అమ్మ అంటే ఎలా వుండాలో ప్రపంచానికి చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలుస్తున్నారు. అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఇటీవల ఒక విద్యార్థి పోలీసుల కస్టడీలో చనిపోయాడు. ఆ విద్యార్థిని పోలీసులు అన్యాయంగా చంపేశాడని స్థానికులు గత కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అయితే మంగళవారం వరకూ ఆ ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి.  బుధవారం నాడు ఆ మరణించిన విద్యార్థి అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా శాంతియుత నిరసన ప్రదర్శన జరుగుతూ వుండగా కొంతమంది కుర్రాళ్లు ముఖానికి ముసుగులు వేసుకుని విధ్వంసకాండకు దిగారు. ఈ అల్లర్ల కారణంగా పరిస్థితులు చెయ్యి దాటిపోయి, పోలీసు ఫైరింగ్ జరిగే ప్రమాదం వుందని అక్కడున్నవారందరూ భయపడిపోయారు. అయితే ఇదే ప్రదేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ‘టోయా గ్రాహమ్’ అనే మహిళ చూపులు ముఖం నిండా ముసుగు కప్పుకుని, పోలీసుల మీదకు రాళ్ళు విసురుతున్న ఒక యువకుడి మీద నిలిచాయి. ఆ ముసుగులో వున్నదెవరో ఆమె కనిపెట్టేసింది. ఎందుకంటే, ఆ యువకుడిని కన్నది తానే కాబట్టి. ఆ ముసుగు యువకుడు తన కుమారుడే అని గ్రహించిన ఆ అమ్మ మనసు ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే ఆ యువకుడి వెంట పడింది. తన తల్లి తనను పట్టుకుని తన ముసుగు తొలగిస్తుందని భయపడిన ఆ యువకుడు ఆమె నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె పట్టు విడవకుండా తన కొడుకు వెంట పరిగెత్తి అతన్ని పట్టుకుంది. అతని ముసుగు తీసి, ఆ చెంపా, ఈ చెంపా వాయించేసింది. తల్లికి దొరికిపోవడంతో ఆ యువకుడు శాంతించి అదుపులోకి వచ్చాడు. మిగతావారు కూడా పారిపోవడంతో అల్లర్లు అదుపులోకి వచ్చి పోలీసు కాల్పులు తప్పాయి. ఈ ఘటనను ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో చూస్తున్న దాదాపు ఐదు లక్షల మంది ప్రేక్షకులు చూశారు. ఆ మహిళ వెంటాడి పట్టుకున్నది తన సొంత కొడుకునే అని తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ ఘటన తర్వాత టోయా గ్రహమ్ మాట్లాడుతూ, తన కొడుకు ముసుగులో వున్నప్పటికీ తాను గుర్తించానని, అల్లర్ల కారణంగా అతని జీవితం నాశనం కావడంతోపాటు పోలీసులు కాల్పులు జరిగితే ఎంతోమంది మరణించేవారు. ఒక తల్లిగా నా బిడ్డ ఎలా సంతోషంగా వుండాలని కోరుకుంటానో, మిగతా తల్లులు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తాను అని చెప్పింది. నా కొడుకు దారి తప్పాడు... ఇప్పుడు అతన్ని సరైన దారిలో పెట్టే పనిలో నిమగ్నమవుతాను అని చెప్పింది. తన చర్యలతో, తన మాటలతో టోయా గ్రహమ్ అమెరికా ప్రజలకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఆమెను అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలవటం మొదలుపెట్టారు.

డస్ట్ బిన్ 'బెస్ట్ బిన్' అవ్వాలి

డస్ట్ బిన్ 'బెస్ట్ బిన్' అవ్వాలి ఇంటి అందం పెంచే వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయా అని వెదికే వాళ్ళ కోసం... ఈ సమాచారం... ఇంట్లోని చెత్తని బయట పడేసే వరకు దానిని అందంగా ఎలా స్టోర్ చేయచ్చో తెలుసా... మాములు బుట్టల నుంచి రంగు రంగుల డస్ట్ బిన్స్ వరకు ఎన్నో చూసారు కదా... ఇప్పుడు పిల్లల రూమ్ కోసం వాళ్ళు ఇష్టపడే రంగులలో, డిజైన్స్ లో ఎన్నో వెరైటీ డస్ట్ బిన్ లు మార్కెట్ లో వున్నాయి. అలాగే లివింగ్ రూమ్ కోసం కాస్త హుందాగా ఉండేవి, డైనింగ్ రూమ్ కోసం ఆకర్ష్యనీయం గా ఉండేవి...ఇలా మన అవసరాలు, ఇష్టాలు బట్టి చెత్త వేసే డబ్బాలని  ఎంచుకుని కొనుక్కోవచ్చు... ఖరీదయిన ఫర్నిచర్ , అందమయిన ఇంటీరియర్, కళ్ళు చెదిరే డెకరేషన్... వీటికి ఎక్కడా తగ్గకుండా ఓ డస్ట్ బిన్ కూడా చేరితే... ఇంకేం వుంది చెప్పండి... మీ ఇల్లు అందంగా మెరిసిపోతుంది. పిల్లలకోసం -రమ

ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త సుమీ...

  ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త సుమీ... * ఆడవారికి బాధ్యతలు ఎక్కువ. సమాజంలో నిర్వహించాల్సిన పాత్రలూ ఎక్కువే. దానితోపాటు ఒత్తిళ్ళూ అధికమే. అందులోనూ ఇంట్లో ఎవరికన్నా ఏపాటి నలతగా వున్నా వారితోపాటు రాత్రింబవళ్ళు ఉంటూ వారికి స్వాంతనని కలిగించేందుకు ప్రయత్నించడంలో మరీ ఒత్తిడికి గురవుతుంది స్త్రీ. అయితే ఈ ఒత్తిళ్ళని కూడా భరిస్తూ తన బాధ్యతలని సక్రమంగా, సరైన సమయంలో పూర్తి చేయడానికి అలవాటుపడిపోయింది. దానితో తన గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి, తనలోని మానసిక ఆందోళన గురించి ఏమాత్రం ఆలోచించదు. అదిగో అలా తనని తాను నిర్లక్ష్యం చేసుకునే ఆడవారిని హెచ్చరిస్తోంది ఇటీవల హార్వర్డ్ మెడికల్ స్కూలు వారు వెలువరించిన పరిశోధన ఫలితం. * ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సేవలు చేయడంలో ఆడవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంటుంది అంటున్నారు పరిశోధకులు. ఆ ఒత్తిడి ఆడవారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని కూడా వీరు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా 65 సంవత్సరాలు పైబడ్డ స్త్రీలని, వారి జీవన శైలిని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులని, వారి వైద్య రికార్డులని పరిశీలించారు. ఒకరు ఇద్దరు కాదు... సుమారు ఐదు లక్షల మందిని పరిశీలించిన ఈ పరిశోధకులు చివరికి తేల్చిన విషయం... కుటుంబంలోని వారి అనారోగ్యం స్త్రీలని తీవ్ర ఒత్తిడికి గురిచేసి, వారి ఆయుష్షుపై ప్రభావాన్ని చూపిస్తుంది అని. అదీ దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారి మంచి చెడ్డలు చూడటంలో అంతర్లీనంగా ఉండే ఎన్నో విషయాలు ఆ ఒత్తిడికి కారణం అవుతాయిట. * వయసు మళ్ళినవారు, మంచిపై ఉన్నవారి ఆలనా పాలనా చూడటంతో తమపై తాము శ్రద్ధ పెట్టకపోవటం, పూర్తిగా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక కారణం అయితే, పోషకాహారం తీసుకోకపోవడం, సంరక్షణ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కువ శ్రమపడటం వంటివి మరో కారణం. ఈ అధ్యయనంలో భాగంగా వివిధ స్త్రీల వైద్య రికార్డుల్ని పరిశీలించినప్పుడు కేన్సర్ వంటి అనారోగ్యంతో బాధపడేవారు ఇంట్లో వున్నవారికంటే తీవ్రమైన అంగవైకల్యానికి గురైన వ్యక్తులు ఇంట్లో వున్న వారు ఎక్కువ ఒత్తిడికి గురైనట్టు తేలింది. శారీకర శ్రమ, సామాజిక ఒత్తిళ్ళు వంటివి కారణం కావచ్చంటున్నారు పరిశోధకులు. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తుల సంరక్షకులకి ఈ ఒత్తిడి మరీ అధికమట. * ‘డిమెన్షియా’ అంటే మతిమరుపు తదితర మానసిక రుగ్మతల బారిన పడిన వారిని సంరక్షించడంలో సాధారణ స్థాయి కంటే ఒత్తిడి, వేదన అధికంగా వుంటాయిట. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థను కాపాడే తెల్ల రక్తకణాలు చురుకుదనాన్ని కోల్పోవడం గమనించారు. దానితో అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు గుర్తించారు. ఇలా రోగుల సంరక్షణలో ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్ళు దాగున్నాయని, ఈ విషయంలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. * ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది. అయినవారి బాధ చూడటం కష్టమే. వారిని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమని చెబుతున్నారు పరిశోధకులు. ముందుగా పరిస్థితులని యథాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనని దగ్గరకి రానీయకపోవడం, మంచి ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకోవడం. అందుకోసం ఇంట్లో మిగిలిన సభ్యుల సహాయ సహకారాలని కూడా కోరటం, ఒత్తిడిగా అనిపించినప్పుడు రిలాక్స్ అయ్యే టెక్నిక్స్‌ని పాటించడం, వీలయితే ఓ గంట ఒంటరిగా ఉండటం వంటివన్నీ అనారోగ్యపు బారిన పడిన వారిని సంరక్షించడంలో మనం అనారోగ్యానికి గురికాకుండా కాపాడే చిన్న జాగ్రత్తలుట. ఎంతైనా మనం ఆరోగ్యంగా వుంటేనే కదా అందరినీ చక్కగా చూసుకోగలిగేది. కాబట్టి కొంచెం ధైర్యంగా, మరికొంచెం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. -రమ

యోగర్ట్ యోగం

  యోగర్ట్ యోగం పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలుసు కదా. అయితే దానిని రోజువారీ వంటలలో విరివిగా ఎలా వాడచ్చో తెలుసుకుంటే పెరుగు వాడకాన్ని పెంచవచ్చు. ఆ చిట్కాలే కొన్ని  ఈ రోజు మీకోసం ఇస్తున్నాం, ఆలోచిస్తే మీకూ కొన్ని తడతాయి. * పెరుగును బాగా చిలికి కొద్దిగా పంచదార, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలను చేర్చాలి. చివరిలో కొంచెం తేనె వేస్తే రుచిగా వుంటుంది. ఎండలు ఎక్కువగా వున్నప్పుడు సాయంత్రాలలో తింటే హాయిగా వుంటుంది. *  చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచం పాలు పోస్తాం కదా.. మెత్తగా వస్తాయని, ఈసారి కొంచం పెరుగు వేసి చూడండి.. రోటీలు మృదువుగా వస్తాయి, పైగా రుచి కూడా పెరుగుతుంది. * బిర్యానీ చేసేటప్పుడు ఓ కప్పు పెరుగు వేస్తే కమ్మదనంతో పాటు రుచి కూడా చాలా బావుంటుంది. * పెరుగు పచ్చళ్ళ గురించి చెప్పేదేముంది... కొబ్బరి, పొట్లకాయ, టమోటా ఇలా ఎన్నోరకాల  పెరుగు పచ్చళ్ళు చేసుకోవచ్చు. * చపాతీలలోకి రైతా చేసుకుంటే చాలా బావుంటుంది. త్వరగా అయిపోతుంది కూడా. బూందీ రైతా అయితే అన్ని రైస్ ఐటమ్స్‌లోకి బావుంటుంది. రోటిలలోకి మాత్రం కీరా, కారెట్, అలాగే ఆనపకాయ తురిమి వేస్తే చాలా రుచిగా వుంటుంది. * చాలా కూరలలో పాలు పోసి వండుతాం కదా.. కొన్ని గ్రేవీ కూరలలో పెరుగు వేస్తారు. కొంచెం పులుపు రుచి వస్తుంది దాని వల్ల కూరకి. * సూపులలో క్రీమ్‌కి బదులుగా పెరుగు వాడవచ్చు. * ఇక ఇన్‌స్టెంట్ రవ్వ దోశలు వేయాలంటే పెరుగు వుండాల్సిందే. వేయించిన రవ్వని పెరుగులో కలిపి కాసేపు పోయాక తగినంత నీరుపోసి వేస్తే రవ్వ దోశలు చక్కగా కుదురుతాయి. * పెరుగు వడలు, ఆవియల్ వంటి కూరలు, దద్దోజనం లాంటి రైస్ ఐటమ్ ఒకటా రెండా.. పెరుగుతో ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. * ఇక లస్సీ, నిమ్మరసం కలిపిన మజ్జిగ దాహాన్ని తీరుస్తాయి. * పెరుగు మన డైజిస్టివ్ సిస్టంని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే వీలు అయినంత ఎక్కువగా పెరుగును వివిధ రూపాలలో మన ఆహారంలో చేర్చుకోవాలి.     -రమ

ఉప్పుతో కొన్ని ఉపకారాలు

ఉప్పుతో కొన్ని ఉపకారాలు ఇంట్లో ఇల్లాలికి చిన్నచిన్న చిట్కాలు తెలిస్తే పని సులువు అవుతుంది. శ్రమ తగ్గుతుంది. అలాంటి చిట్కాలలో అందుబాటులో ఉండే ఉప్పుతో కొన్ని ...... 1) మైక్రోఓవెన్ లో వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పదార్థాలు పొంగుతాయి. ఆసమయంలో ఓవెన్ అంతా శుభ్రం చెయ్యాలంటే పెద్దపనే - పైగా పదార్థాలు కాలిన వాసన ఓవెన్ లో అలానే ఉంటుంది. అందుకు చెయ్యాల్సిందల్లా పదార్థాలు పడిన చోట కొద్దిగా ఉప్పును చల్లి, పొడి వస్త్రంతో తుడిస్తే చాలు. ఓవెన్ శుభ్రపడడంతో పాటు, పదార్థాలు కాలినవాసన కూడా పోతుంది. 2) టీ, కాఫీ, తాగే కప్పులు మనం తోమినా, అడుగున నల్లగా మరకలు కట్టి ఉంటాయి. ఆ కప్పుల్లో చిటికెడు ఉప్పు వేసి, శుభ్రం చేస్తే కొత్త వాటిల్లా మెరుస్తాయి. గాజు, పింగాణి పాత్రలని ఇలా ఉప్పుతో శుభ్రం చేస్తే తెల్లగా మెరుస్తాయి. 3) అందానికి ఫ్లవర్ వాజ్ లలో పెట్టే ప్లాస్టిక్ పూలకి దుమ్ము పడితే, వాటిని నీటితో శుభ్రం చేసేకంటే ఒక ప్లాస్టిక్ కవరులో గుప్పెడు ఉప్పు వేసి, ఈ పువ్వులని కవరులో పెట్టి బాగా అటుఇటు కదిపితే, పువ్వులకి ఉండే మురికి వదులుతుంది. పువ్వులు కొత్తవాటిల్లా కనిపిస్తాయి.   4) టూత్ బ్రష్షులలో బ్యాక్టీరియా చేరుతుందని మీకు తెలుసా ? ఆ బ్యాక్టీరియా వల్ల దంతాలకు ఎంతో హాని జరుగుతుంది. అలా కాకూడదు అంటే వారానికి ఒక్కసారైనా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో బ్రష్షులని వేసి ఒక 15 నిముషాలు ఉంచి కడగాలి. 5) వంటింటి గట్టు, డైనింగు టేబుల్ వంటివి ఉప్పు కలిపిన నీటితో శుభ్ర పరిస్తే ఈగల సమస్య ఉండదు. 6) ఒక మగ్గు నీటిలో గుప్పెడు ఉప్పు వేసి, ఆ నీటితో కిటికీ అద్దాలను, కారు అద్దాలను, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను తుడిస్తే మిలమిలా మెరుస్తాయి. 7) ఆపిల్ ని కట్ చేసాక గాలికి వదిలేస్తే ఎర్రగా మారుతుంది. అదే చిటెకెడు ఉప్పువేసిన నీటిలో ఆపిల్ ముక్కలను వేస్తే రంగు మారకుండా ఉంటాయి. 8) ఇంట్లో ఎక్కడైనా చీమలు వస్తే ఆ చుట్టుపక్కల ఉప్పుతో ఒకగీతను గీయండి, చీమలు ఆ ఉప్పుగీతను దాటి రావు. 9) ఇంట్లో ఉన్న కార్పెట్లను శుభ్రం చేయాలంటే ముందురోజు రాత్రి ఆ కార్పెట్లమీద ఉప్పును చల్లండి. మర్నాడు కార్పెట్ ని వాక్యూం క్లీనర్ తో క్లీన్ చేస్తే కార్పెట్లు ఫ్రెష్ గా ఉంటాయి. చెడువాసనలు ఏమైనా ఉంటే పోతాయి.   10) కొత్తబట్టలని మొదటిసారిగా ఉతికేటప్పుడు ఉప్పువేసిన నీటిలో నానబెట్టి ఉతికితే రంగులు పోకుండా ఉంటాయి. -రమ

మహిళలకు రైల్వే వరాలు

    మహిళలకు రైల్వే వరాలు   ఈసారి రైల్వే బడ్జెట్‌లో మహిళల మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. రైలు ప్రయాణంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు సక్రమంగా అమలైతే రైలు ప్రయాణం మహిళలకు మరింత సౌకర్యవంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. * టోల్ ఫ్రీ నంబర్ 182 నుండి ఎటువంటి భద్రత సహాయకర చర్యల కోసమైనాకాల్ చేయవచ్చు. * ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులు ఫ్లాట్ ఫాం మీద ఉండేలా చూస్తారు. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లలో ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటు. * ట్రావెలింగ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆల్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ 138 నుండి రిపోర్టు చేయవచ్చు. * రైల్వే స్టేషన్లలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం 4.72 కోట్లు కేటాయింపు. * రైల్వే డిపార్ట్‌మెంటుకు సంబంధించిన కంప్లయింట్స్ ఇవ్వడానికి మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తే రైళ్ళలో ప్రయాణించే మహిళలకు మరింత సౌకర్యవంతంగా వుంటుంది.

అమృతానికి బ్రదర్.. వెనిగర్

    అమృతానికి బ్రదర్.. వెనిగర్   బట్టల మీద మరకలా ? కిటికీ అద్దాలు, తలుపులు మెరిసేలా చేయాలా ? మొక్కల మొదలులో చీమలు ఎక్కువగా ఉన్నాయా ? కూరలు త్వరగా వుడకాలా ? ఇలాంటి ఎన్నో ఇబ్బందులకి విరుగుడు వెనిగర్.  దీనిలో  వుండే ఆమ్లగుణం వల్ల ఇది దానికదే ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది.  పైగా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలేంటో  చూద్దాం. 1. బట్టల మీద కాఫీ, టీ మరకలు పోవాలంటే కొంచెం వెనిగర్, కొంచెం ఉప్పు సమపాళ్ళలో తీసుకుని ఆ మరకలు పడ్డ చోట రుద్దితే మరకలు పోతాయి. 2. కొత్త బట్టలు  మొదటిసారి ఉతికేటప్పుడు ఆ నీటిలో చిన్న కప్పు వెనిగర్ వేసి చూడండి . అవి రంగులు పోకుండా వుంటాయి. 3. కిటికీ అద్దాలు, తలుపులు మెరవాలంటే పొడి బట్ట మీద కాస్త వెనిగర్ వేసి తుడిస్తే చాలు. 4. వంట పాత్రలని , ఓవెన్‌ని, వెనిగర్‌తో శుభ్రం చేస్తే మరకలు పోయి, ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా    వుంటాయి. 5. ఇక మొక్కల మొదట్లో వెనిగర్‌ని స్ప్రే చేస్తే పురుగు పట్టకుండా వుంటుంది. అలాగే చీమలు వంటివి కూడా చేరవు. 6. కొన్ని కూరలు త్వరగా ఉడకవు. అలాంటప్పుడు కొంచం వెనిగర్ వేస్తే... అవి త్వరగా వుడుకుతాయి . 7. ఇంట్లో చేసే పచ్చళ్ళు బూజు పట్టకుండా వుండాలంటే వాటిలో కొంచెంవెనిగర్ వేసి చూడండి. 8. కోడి గుడ్లు ఉడికించే టప్పుడు ఒక టీ స్పూన్ వెనిగర్ వేస్తే తెల్ల సొన బయటకు రాకుండా వుంటుంది. 9. చికెన్ , మటన్ మెత్తగా ఉడకాలంటే కాస్త వెనిగర్ వేస్తే చాలు. 10. వెనిగర్‌తో చేతులు రుద్దుకుంటే, మృదువుగా వుంటాయి.   - రమ