English | Telugu
`స్టార్ మా`లో నేటి నుంచే `వంటలక్క` షురూ
Updated : Jun 6, 2022
పరిటాల నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ జంటగా నటించిన పాపులర్ సీరియల్ `కార్తీక దీపం`. బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని ఈ ఇద్దరినీ టాప్ సెలబ్రిటీలుగా మార్చేసింది. మరీ ముఖ్యంగా ఇందులో వంటలక్క పాత్రలో దీపగా నటించిన ప్రేమి విశ్వనాథ్ ని స్టార్ గా మార్చి పాపులర్ అయ్యేలా చేసింది. ఇందులో ప్రేమి విశ్వనాథ్ పోషించిన వంటలక్క పాత్ర సామాన్యులతో పాటు సెలబ్రిటీలని సైతం ఆకట్టుకుని అభిమానులుగా మారేలా చేసింది. అలా పాపులర్ అయిన వంటలక్క పేరుతో కొత్తగా స్టార్ మాలో ఓ సీరియల్ ప్రారంభం అవుతోంది.
ధీరవీయమ్ రాజకుమారన్, శిరీన్ శ్రీ ప్రధాన జంటగా నటించిన సీరియల్ `వంటలక్క`. ఇతర పాత్రల్లో నీళల్ గళ్ రవి, మౌనిక తదితరులు నటించారు. ఈ సీరియల్ జూన్ 6 నుంచి మధ్యాహ్నం 2.30 ని.లకు ప్రసారం కానుంది. బంగారు బొమ్మలా చూసుకునే పెద్దింటి కుటుంబంలో పుట్టిన ఓ యువతికి.. అత్యాశకు పోయి ఎలాంటి భయం లేకుండా ఊరు నిండా అప్పులు చేసే ఓ బాధ్యతలేని యువకుడు ఆస్తి కోసం వల వేస్తాడు. చివరికి పెళ్లి చేసుకుంటాడు. తన భర్త కోసం పుట్టింటి వారి నుంచి చిల్లి గవ్వ కూడా తనకు వద్దని భర్తతో కలిసి ఆ యువతి ఇంటిని, తన కుటుంబాన్ని కాదని బయటికి వచ్చేస్తుంది.
వస్తుందనుకున్న ఆస్తి రాకపోగా భార్య చీప్ గా వంటలు చేస్తూ సంసారాన్ని సాగిస్తుండటంతో తనని చీదరించుకుంటూ హింసిస్తుంటాడు. ఈ క్రమంలో వంటలక్క జీవితం ఎలాంటి మలువులు తిరిగింది? .. ఆత్మగౌరవం వున్న యువతి తన పుట్టింటి వారిని సహాయం అడిగిందా? లేక తన భర్తని మార్చుకుని విధి ఆడిన వింత నాటకంలో విజయం సాధించిందా? అన్నదే ఈ సీరియల్ ప్రధాన కథ. జూన్ 6 సోమవారం నుంచి ప్రారంభం కానున్నఈ సీరియల్ సోమ వారం నుంచి శనివారం వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 ని.లకు ప్రసారం కాబోతోంది.
