English | Telugu
సుడిగాలి సుధీర్ గుండెల్లో రష్మీ!
Updated : Jun 18, 2022
బుల్లితెరపై రష్మీ గౌతమ్ - సుడిగాలి సుధీర్ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్లద్దరు షోలో వుంటే ఆ షో బ్లాక్ బస్టరే. టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ కి వెళ్లి షోని టాప్ లో నిలబెడుతుంది. అంతగా వీళ్ల జంట పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే స్థాయిలోనూ వీరికి భారీ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. రష్మీ - సుడిగాలి సుధీర్ మధ్య కనిపించే కెమిస్ట్రీ.. ఇద్దరి మధ్య పుట్టే రొమాన్స్.. వీళ్లు లవర్స్ అని, బయటపడకుండా ప్రేమాయణం సాగిస్తున్నారంటూ ఇప్పటికే చాలా వార్తలు పుట్టుకొచ్చాయి.
రష్మీ - సుధీర్ కలిసి డాన్స్ రియాలిటీ షో 'ఢీ'కు వెళ్లాక ఆ ప్రచారం మరింతగా పెరిగింది. షోలో డాన్స్ చేసేవాళ్ల కంటే వీరిద్దరి కోసమే ఈ షోని చూసిన వాళ్లున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇద్దరికున్న క్రేజ్ ఎలాంటిదో! షో లోనూ ఇద్దరూ లవర్స్ గా ఒకరిని ఒకరు టీజ్ చేసుకుంటూ కనిపించిన తీరు మరింత మందిని వారికి అభిమానులుగా మార్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ `ఢీ` షో నుంచి బయటికి వచ్చేశారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు కూడా సుధీర్ గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం జీటీవి, స్టార్ మాలలో ప్రత్యేక షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా జీ తెలుగులో ఫాదర్స్ డే సందర్భంగా `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్రత్యేక ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. దీనికి శ్రీముఖితో కలిసి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించాడు. ఈ షోలో `విరాటపర్వం` టీమ్ రానా, సాయి పల్లవి, డి. సురేష్ బాబు తో పాటు `పక్కా కమర్షయిల్` టీమ్ గోపీచంద్, రాశిఖన్నా, మారుతి పాల్గొన్నారు. వీరితో పాటు రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, శైలజ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో టీవీ సీరియల్ నటీనటులు, సుడిగాలి సుధీర్ అభిమానులు పాల్గొన్నారు. వాళ్లలో కొంత మంది స్టేజ్ పైకి వచ్చారు.
ఓ ఏడేళ్ల పిల్లాడు సుధీర్ ని 'బాబాయ్' అని పిలవడమే కాకుండా 'రష్మీ పిన్ని ఏది?' అంటూ అమాయకంగా అడిగాడు. ఆ ప్రశ్నకు సుడిగాలి సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. 'రష్మీ గుండెల్లో వుంటుంది.. బయటికి రాదు'.. అన్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.