English | Telugu
పవన్, ఎన్టీఆర్ రికార్డులని మహేష్ బ్రేక్ చేస్తాడా?
Updated : Aug 8, 2023
ఇప్పటిదాకా వారి కాంబినేషన్ లో వచ్చింది రెండు సినిమాలే అయినప్పటికీ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోకి టాలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'పోకిరి' సంచలన వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వీరి కాంబోలో రెండో సినిమాగా వచ్చిన 'బిజినెస్ మేన్' పోకిరి స్థాయి సంచలనాలు సృష్టించనప్పటికీ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి ఎందరో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్ పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్, టోటల్ కలెక్షన్స్ కలెక్షన్స్ పరంగా 'ఖుషి', 'సింహాద్రి' టాప్ లో ఉన్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం రీరిలీజ్ సినిమాల్లో ఇప్పటిదాకా 'ఖుషి', 'సింహాద్రి' మాత్రమే మొదటిరోజు రూ.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి. ఖుషి రూ.4.15 కోట్ల గ్రాస్ రాబట్టగా, సింహాద్రి రూ.4.01 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక టోటల్ కలెక్షన్స్ పరంగానూ ఈ రెండు సినిమాలే టాప్ లో ఉన్నాయి. రీరిలీజ్ లోనూ ఖుషి వారానికి పైగా విజయవంతంగా ప్రదర్శితమై రూ.7.46 కోట్ల గ్రాస్ తో సత్తా చాటగా.. సింహాద్రి మాత్రం రెండు మూడు రోజులకే పరిమితమై రూ.4.60 కోట్ల గ్రాస్ సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.3.36 కోట్లతో 'ఆరెంజ్', రూ.3.20 కోట్లతో 'జల్సా' ఉన్నాయి. ఇక మహేష్ చిత్రాలు ఒక్కడు రూ.2.54 కోట్లు, పోకిరి రూ.1.73 కోట్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు 'బిజినెస్ మేన్'తో తన అసలిసలు బాక్సాఫీస్ స్టామినా చూపించబోతున్నారు మహేష్. ఇప్పటికే ఒక్క హైదరాబాద్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో కోటికి పైగా గ్రాస్ రాబట్టిందని అంటున్నారు. ఈ చిత్రం 'ఖుషి', 'సింహాద్రి' సినిమాల రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరి 'బిజినెస్ మేన్' ఆ అంచనాలను నిజం చేస్తూ రీరిలీజ్ లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.