English | Telugu
రూ.450 కోట్ల బడ్జెట్‌తో విశాల్ సినిమా!
Updated : Mar 4, 2023
పురట్చి తలైవన్ విశాల్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు కుష్బు భర్త సుందర్ సి. సంఘమిత్ర అనే సినిమాను రూ.450 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాను 300 కోట్లతో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు సుందర్.సి. ఆయన ప్రకటించినప్పుడు హీరో, హీరోయిన్లుగా జయం రవి, శ్రుతిహాసన్ పేర్లు వినిపించాయి. అయితే ప్రాజెక్ట్ మరింత లేట్ అవుతుండటంతో సారీ చెప్పేసి పక్కకు తప్పుకున్నారు శ్రుతిహాసన్. సంఘ మిత్ర కేరక్టర్ కోసం అప్పట్లో శ్రుతి కత్తిసాము కూడా నేర్చుకున్నారు. కళరియపట్టు మీద కూడా గ్రిప్ సాధించారు. ఇప్పుడు జయం రవి ప్లేస్‌లో విశాల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కథ సంఘమిత్ర. ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తారట. ఇంకా డాటెడ్ లైన్స్ మీద పూజా సంతకం చేయలేదట. ప్రాజెక్ట్ ఆఫర్ గురించి విని ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగారట. యువరాణిగా నటించాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరుతుందన్న అభిప్రాయాన్ని కూడా సన్నిహితులతో షేర్ చేసుకున్నారట పూజా హెగ్డే. సుందర్.సి ఇప్పుడు అరణ్మణై 4 తీయాల్సింది. ఈ ప్రాజెక్టు కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే తీరా, ఈ ప్రాజెక్టులో నటించడం లేదని చేతులు ఎత్తేశారు విజయ్ సేతుపతి. రెమ్యునరేషన్ల దగ్గర గొడవరావడంతో హీరోగారు తప్పకున్నారని కోడంబాక్కం సమాచారం.
ఆ సినిమా పోయినా ఫర్వాలేదు, సంఘమిత్రను పట్టాలెక్కిస్తే చాలు అని అనుకుంటున్నారట సుందర్.సి. ఆల్రెడీ మెడ్రాస్ టాకీస్‌తో కలిసి పొన్నియిన్ సెల్వన్ సినిమాను రూపొందిస్తోంది లైకా సంస్థ. రీసెంట్‌గా సుందర్.సి కూడా లైకా సంస్థనే వెళ్లి కలిశారట. సుందర్ చెప్పిన భారీ కేన్వాస్ నచ్చి సినిమా చేయడానికి తలూపిందట లైకా. ఆల్రెడీ విశాల్‌కి తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమాతో నార్త్ మార్కెట్‌ని కూడా చేతుల్లోకి తెచ్చేసుకోవాలనే కోరికతో ఉన్నారట విశాల్. అన్నీ సక్రమంగా కుదిరితే సంఘమిత్ర ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.