English | Telugu
మంచు మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి చేసుకున్నారు!
Updated : Mar 4, 2023
ఎన్నో రోజులుగా వార్తల్లో నలుగుతూ వస్తోన్న మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి మధ్య అనుబంధం ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తల బంధంగా మారింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆ ఇద్దరూ శుక్రవారం రాత్రి పెళ్లి చేసుకున్నారు. ఫిల్మ్ నగర్‌లోని మంచువారి నివాసంలో వారి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు మనోజ్ తల్లితండ్రులు మోహన్‌బాబు, నిర్మల, అక్కయ్య లక్ష్మి, అన్న విష్ణు సహా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు.
కాగా ఈ వివాహానికి మోహన్‌బాబు మొదటి నుంచీ విముఖంగా ఉన్నారనీ, అందుకని ఆయన ఈ వేడుకకు రాకపోవచ్చనీ ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకతో అవన్నీ ఉత్త వదంతులేనని తేలిపోయింది. పైగా పెళ్లి వేడుకలో మోహన్‌బాబును మౌనిక ప్రేమగా కౌగలించుకోగా, ఆమెను ఆయన 'దీర్ఘసుమంగళీభవ' అని ఆప్యాయంగా ఆశీర్వదించారు. మౌనిక టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ చెల్లెలు.
మనోజ్, మౌనిక ఇద్దరికీ ఇది రెండో వివాహమే. 2015లో ప్రణతిరెడ్డిని వివాహం చేసుకున్నాడు మనోజ్. 2019లో వారిద్దరూ విడిపోయారు. మౌనికకు కూడా ఇదివరకు బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగి, తర్వాత విడాకులు మంజూరయ్యాయి.
కొంతకాలంగా మనోజ్, మౌనిక సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని వారు ప్రారంభించారు.