English | Telugu
ఎన్టీఆర్ కాదు.. 'జటాయు'లో విజయ్ దేవరకొండ!
Updated : Jun 21, 2023
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు రాబోయే రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ లో పలు భారీ ప్రాజెక్ట్ లు చేయబోతున్నట్లు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. వాటిలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'జటాయు' కూడా ఉంది. అయితే యువ హీరోలతో లవ్ స్టొరీలు, మీడియం రేంజ్ సినిమాలు చేసే ఇంద్రగంటితో భారీ సినిమా తీయడానికి దిల్ రాజు సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మైథలాజికల్ టచ్ ఉన్న ఈ భారీ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనే చర్చ కూడా జరిగింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఊహించనివిధంగా విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది.
'లైగర్'తో పాన్ ఇండియా ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్న విజయ్.. ఏమాత్రం నిరాశ చెందకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దీనితో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD 12', పరశురామ్ దర్శకత్వంలో 'VD 13' చేయనున్నారు. వీటి తర్వాత విజయ్ చేయబోయే సినిమా 'జటాయు' అని బలంగా న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్, ఇంద్రగంటి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని.. ఈ సినిమా చేయడానికి విజయ్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేయనున్న 'VD 13'కి కూడా దిల్ రాజే నిర్మాత. ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే విజయ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. అన్ని అనుకున్నట్లు జరిగితే 'జటాయు' వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు.