English | Telugu
ప్రభాస్ సినిమా టైటిల్ మారింది!
Updated : Jun 21, 2023
ఓ వైపు 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి భారీ సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోవైపు ఊహించనివిధంగా దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన రాకుండానే సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి మొన్నటివరకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, తాజాగా కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది.
'బాహుబలి' తర్వాత వరుస భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి 'బుజ్జిగాడు', 'డార్లింగ్' వంటి సినిమాలు ఆశించలేమా? ఆయన వింటేజ్ లుక్ ని, కామెడీ టైమింగ్ ని చూడలేమా? అనే ప్రశ్నలకు సమాధానంగా మారుతి సినిమా ఉంటుందని ముందు నుంచి వినిపిస్తున్న మాట. ఈ సినిమాలో ప్రభాస్ మునుపటిలా అందంగా, స్టైలిష్ గా కనిపించనున్నారని.. ఆయన కామెడీ టైమింగ్ ని చూడబోతున్నామని అంటున్నారు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు దానికి బదులుగా 'రాయల్' అనే టైటిల్ ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ప్రభాస్ పేరు వినగానే రాజు, రాయల్ అనే పదాలు గుర్తుకొస్తాయి. ఆయన సినిమాకి 'రాయల్' అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.