Read more!

English | Telugu

సీనియర్ డైరెక్టర్ కె. వాసు కన్నుమూత

 

సీనియర్ డైరెక్టర్ కె. వాసు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఒకప్పటి గొప్ప దర్శకుడు కె. ప్రత్యగాత్మ ఆయన తండ్రే. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కె. వాసు చిత్రాలు రూపొందించారు. 1974లో విడుదలైన 'ఆడపిల్లల తండ్రి' దర్శకుడిగా ఆయన తొలి చిత్రం. 

చిరంజీవి నటించగా తొలిగా విడుదలైన 'ప్రాణం ఖరీదు' (1978) చిత్రానికి కె. వాసు దర్శకుడు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా ఆయన 'కోతల రాయుడు' (1979), 'ఆరని మంటలు' (1980) సినిమాలు తీశారు. ఎన్టీ రామారావుతో 'సరదా రాముడు' (1980), శోభన్‌బాబుతో 'దేవుడు మావయ్య' (1981), కృష్ణంరాజుతో 'గువ్వల జంట', 'బాబులు గాడి దెబ్బ' చిత్రాలు రూపొందించారు. కృష్ణ, చిరంజీవి హీరోలుగా నటించిన 'తోడు దొంగలు' (1981) మూవీ డైరెక్టర్ కె. వాసునే. 

ఆయన డైరెక్ట్ చేయగా పాపులర్ అయిన సినిమాల్లో ఏది పాపం ఏది పుణ్యం, గోపాలరావు గారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, కలహాల కాపురం, కొత్త దంపతులు, అమెరికా అల్లుడు, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం, అయ్యప్పస్వామి మహత్యం, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, పుట్టినిల్లా మెట్టినిల్లా తదితర చిత్రాలు ఉన్నాయి.

కె. వాసు మృతిపై చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన తొలినాటి చిత్రాలు 'ప్రాణం ఖరీదు', 'కోతల రాయుడు'ను ఆయన డైరెక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.