Read more!

English | Telugu

‘బూ’ సినిమా రివ్యూ

 

సినిమా పేరు: బూ
నటీనటులు: రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్ సేన్, మేఘా ఆకాష్, నివేద పేతురాజ్, రెబా మోనికా జాన్, మంజిమా మోహన్, ఆర్యా, విద్యుల్లేఖ రామన్, పృథ్వీరాజ్, గురు ప్రీత్
సినిమాటోగ్రఫీ: సందీప్ కె విజయ్
సంగీతం: జి.వి. ప్రకాశ్ 
ఎడిటింగ్: ఆంథోని
నిర్మాతలు: శ్రీ రామాంజనేయులు, ఎం. రాజశేఖర్ రెడ్డి
డైరెక్టర్: ఎ.ఎల్. విజయ్
ఓటీటీ వేదిక: జియో సినిమా 

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారు‌. అలాంటి కోవకి చెందిందే జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ 'బూ'. మరి ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం.

కథ: 

కైరా(రకూల్ ప్రీత్ సింగ్) తన రూంలో పార్టీ కోసం అన్నీ సిద్ధం చేస్తుంటుంది. అప్పుడే తన ముగ్గురు ప్రెండ్స్ కార్ లో బయల్దేరి వస్తున్నట్టుగా కాల్ చేస్తారు. ఇంకొక అర్థగంటలో అక్కడ ఉంటామని చెప్పగా.. త్వరగా రమ్మని చెప్పి కైరా కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి తన ముగ్గురు ఫ్రెండ్స్ రావడంతో పార్టీ స్టార్ట్ చేస్తారు. మొత్తం నలుగురు అమ్మాయిలు కలిసి హాలోవీన్ డే రోజున పార్టీ జరుపుకుంటారు. హాలోవీన్ డే పార్టీ అంటే దెయ్యాల కోసం ఒక రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. ఆ నలుగురు కలిసి మొదట ఓజో బోర్డ్ సహాయంతో ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుంటారు. ఆ తర్వాత దెయ్యాల సినిమాలు చూస్తారు. అలా చూస్తుండగా సడన్ గా కరెంట్ పోతుంది. ఆ తర్వాత గదిలో ఉన్న క్యాండిల్స్ వెలుగుతో ఆ రాత్రి గడపాలనుకుంటారు. ఆ క్యాండిల్స్ వెలుగులో ఆ నలుగురు అమ్మాయిలు కలిసి దెయ్యాల కథలు ఉండే ఒక పుస్తకాన్ని చదువుతారు. అయితే ఆ పుస్తకంలోని మొదటి పేజీలోనే కొన్ని ముఖ్యమైన నియమాలు రాసి ఉంటాయి. వాటికి కట్టుబడి ఆ పుస్తకాన్ని చదవాలని అందులో రాసి ఉంటుంది. మరి ఆ నలుగురు అమ్మాయిలు ఆ పుస్తకంలోని అన్ని ఛాప్టర్స్ ని చదివారా? ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కైరా(రకుల్ ప్రీత్ సింగ్) తన ఫ్రెండ్స్ తో కలిసి హాలోవీన్ డే సెలబ్రేషన్స్ లో హంటింగ్ స్టోరీస్ గురించి మాట్లాడుతుండగా.. అందులో ఒక ఫ్రెండ్, వాళ్ళ తాత హర్రర్ సినిమా చూసి చనిపోయాడని చెప్పడంతో అదే సినిమాని చూస్తారు. తర్వాత కరెంట్ పోవడంతో దెయ్యాల కథలు చదువుతూ అందులోని వచ్చే పాత్రలతో కనెక్ట్ అవుతారు. దాంతో కథ మరింత ఆసక్తిని కలుగజేస్తుంది. అయితే హంటింగ్ బుక్ లోని ఒక్కో ఛాప్టర్ ముగిసేకొద్దీ కైరా, తన ఫ్రెండ్స్ కి ఆ బుక్ లోని సీరియస్ నెస్ అర్థమవుతుంది. అయితే కథలన్నీ ముగిసాక వచ్చే ట్విస్ట్ లతో చూసే ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. కథ చివరివరకు ఒక ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తుంది. కథలోని పాత్రలన్ని ఒక్కొక్కటిగా వస్తుంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటిని కలుగజేస్తూ కథని ముందుకు తీసుకెళ్ళాడు డైరెక్టర్. అయితే ఎప్పుడైతే ఆకాష్(విశ్వక్ సేన్) పాత్ర మొదలవుతుందో కథ మరింత ఇంటెన్స్ ని కలిగిస్తుంది. అయితే చివరగా ఆకాష్ పాత్రను ‌లింక్ చేసే సీన్స్ అన్నీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయనే చెప్పాలి.

కథ ప్రథమార్థం నుండి ఇంటర్వెల్ వరకు ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ సాగుతుంది. అయితే ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ లతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే కథ మరో రెండు నిమిషాలలో ముగుస్తుందనుకున్నప్పుడు కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. కథ ఇంకా అవలేదు.. ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా ఫినిష్ చేసాడు డైరెక్టర్. కథలో కొత్తదనంతో పాటు కథనం నడిపిన తీరు బాగుంది. మెస్మరైజింగ్ స్క్రీన్‌ప్లే తో ఈ సినిమా చివరివరకు ఎంగేజింగ్ చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టని సీన్స్, ఇవి బాలేవు అనేట్టుగా ఏ ఒక్క సీన్ లేకుండా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్. 

సందీప్ సినిమాటోగ్రఫీ ప్రధానంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హంటెడ్ బిల్డింగ్ లో గ్లాసెస్ తో దెయ్యాలను చూపించే సీన్స్ బాగున్నాయి. లైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ మంచి అవుట్ పుట్ ని ఇచ్చారు. జివి ప్రకాశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా నివేద పేతురాజ్ కి వెక్కిల్లు వచ్చిన ప్రతీసారీ లైట్స్ ఆఫ్ ఆన్ అయ్యినప్పుడు బిజిఎమ్ ఒక థ్రిల్ ని కలుగజేస్తుంది. ఆంథోని ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది. అవకాశం లభిస్తే మంచి థ్రిల్లర్స్ ని అందించగలడని డైరెక్టర్ టేకింగ్ తెలియజేసింది.

నటీనటుల పనితీరు: 

కైరా గా రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంది. కైరా ఫ్రెండ్స్ గా రెబా మోనికా జాన్, మంజిమ మోహన్, విద్యుల్లేఖ రామన్ మంచి సపోర్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా దెయ్యాలు ఉన్నాయన్నప్పుడు ప్రతి ఒక్కరు చూపించిన హావభావాలు సినిమాకి ప్రాణం పోశాయి. ఆకాష్ గా విశ్వక్ సేన్ కీలకపాత్రని పోషించాడు. పారానార్మల్ సైంటిస్టు గా ఆ పాత్రలో తను ఒదిగిపోయాడు. మేఘా ఆకాష్, నివేద పేతురాజ్, మంజిమా మోహన్ వారి పాత్రలలో ఒదిగిపోయారు. థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ కూడా పోలీస్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలినవారు వారి వారి పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

తెలుగువన్ ఎనాలసిస్: 

ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ది బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ సినిమాలలో 'బూ' చేరుతుంది. కథలో కొత్తదనంతో పాటు ట్విస్ట్ లతో థ్రిల్ ని కలుగజేసే ఈ సినిమా ప్రేక్షకులు హ్యాపీగా చూడొచ్చు. ముఖ్యంగా హర్రర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఫీస్ట్ అనే చెప్పాలి.

రేటింగ్: 4 /5

✍🏻.  దాసరి మల్లేశ్