English | Telugu
'బలగం' దర్శకుడికి భారీ ఆఫర్!
Updated : Mar 9, 2023
'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు(వేణు యెల్దండి) మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 3న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి వసూళ్ళు రాబడుతోంది. కమెడియన్ వేణులోని దర్శకత్వ ప్రతిభ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు నిర్మాత దిల్ రాజు.. దర్శకుడిగా వేణుకి ఓ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రశంసలతో పాటు మంచి వసూళ్ళు రాబడుతోంది. దీంతో వేణుకి దిల్ రాజు మరో అవకాశమిచ్చాడు. బలగం దర్శకుడు వేణుతో త్వరలో ఓ పెద్ద సినిమా చేయబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు తెలిపాడు. మరి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న వేణు.. ఈ పెద్ద అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.