English | Telugu
నేచురల్ స్టార్ చేతికి అల్లు అర్జున్ 'ఐకాన్'!
Updated : Feb 23, 2023
రెండేళ్ల క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' అనే మూవీ తెరకెక్కాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల అటకెక్కింది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో బిజీ అయిపోయాడు. మరోవైపు వేణు శ్రీరామ్ కూడా 'ఐకాన్'ని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' అనే చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వేణు మనసు మళ్ళీ 'ఐకాన్' వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
'ఓ మై ఫ్రెండ్'తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్.. తన రెండో సినిమా 'ఎంసీఏ'(మిడిల్ క్లాస్ అబ్బాయి)ని నానితో చేసిన సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత తన మూడో సినిమా 'వకీల్ సాబ్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న వేణు.. ఇప్పుడు తన నాలుగో సినిమాని నానితో చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వేణు దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు దిల్ రాజునే నిర్మాత కాగా.. ఇప్పుడు నాలుగో సినిమాని కూడా ఆయనే నిర్మించబోతున్నారట. 'ఐకాన్' స్క్రిప్ట్ పట్ల దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.
కాగా నాని మార్చి 30న 'దసరా' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే తన తదుపరి చిత్రం(నాని 30)ని శౌర్యువ్ దర్శకత్వంలో ప్రకటించాడు. మరి నాని తన 31వ సినిమాని తనకు 'ఎంసీఏ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తాడేమో చూడాలి.