English | Telugu
అదిరిపోయిన 'ఉస్తాద్' ఫస్ట్ లుక్!
Updated : Feb 23, 2023
'మత్తు వదలవరా', 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త' వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన శ్రీసింహా కోడూరి 'ఉస్తాద్' అనే ఆసక్తికరమైన చిత్రంలో నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
నేడు(ఫిబ్రవరి 23) శ్రీసింహా పుట్టినరోజు సందర్భంగా 'ఉస్తాద్' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో పైలట్ సూర్య శివకుమార్ పాత్రలో శ్రీసింహా కనిపిస్తున్నాడు. "తన కలలకు రెక్కలు ఇచ్చేందుకు ఒక చిన్న పట్టణం నుండి ఆకాశం వరకు ఎదిగిన ధైర్యవంతుడైన పైలట్‌ను కలవండి" అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పైలట్ గా శ్రీసింహా లుక్, పోస్టర్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది.
రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పవన్ కుమార్ పప్పుల, మ్యూజిక్ డైరెక్టర్ గా అకీవా.బి, ఎడిటర్ గా కార్తీక్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.