English | Telugu
బాలయ్యనే మెలికలు తిరిగేలా చేసిన రష్మిక.. పాపం విజయ్!
Updated : Nov 18, 2023
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో నుంచి వైల్డెస్ట్ ఎపిసోడ్ రాబోతుంది. 'యానిమల్' టీం నుండి హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రోమోని విడుదల చేశారు.
'అన్ స్టాపబుల్' షో అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం బాలకృష్ణ హోస్టింగ్ అని చెప్పవచ్చు. వయసులో తనకంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన గెస్ట్ లు అందరితోనూ సరదాగా ఉంటూ బాలయ్య తనదైన శైలిలో షోని నడిపిస్తున్నాడు. ఇప్పుడిక 'యానిమల్' టీంతో అదిరిపోయే వినోదాన్ని పంచబోతున్నాడని ప్రోమోని బట్టి అర్థమవుతోంది.
"నువ్వు ఆ విస్కీ ఆపేసి, నా బ్రాండ్ కి వచ్చేయ్.. త్వరగా రాయడం మొదలుపెడతావ్" అంటూ సందీప్ రెడ్డితో బాలయ్య చెప్పే సంభాషణతో ప్రోమో మొదలైంది. ఆ తర్వాత అదిరిపోయే ఇంట్రోతో రణబీర్ కి స్వాగతం పలకగా.. "ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు" అంటూ ఆయన బాలయ్య ముందే బాలయ్య డైలాగ్ చెప్పడం విశేషం. అంతేకాదు ఇద్దరు కలిసి డ్యాన్స్ కూడా వేశారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ గులాబీ పట్టుకొని క్యూట్ గా రష్మికను ఇన్వైట్ చేశాడు. రష్మికతో కలిసి డాన్స్ చేసిన బాలయ్య.. "రష్మిక మెలికలు తిరిగిపోతుంటే.. నా గుండె మెలికలు తిరిగిపోతుంది" అంటూ క్యూట్ డైలాగ్ కొట్టాడు. ఇక విజయ్ దేవరకొండ ఫోన్ కాల్ లో మాట్లాడగా.. రౌడీ హీరోని ఆటపట్టిస్తూ "ఐ లవ్ రష్మిక" అని అన్నాడు నటసింహం. ఇక చివరిలో బాలయ్య మూవీలోని "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" డైలాగ్ చెప్పి సర్ ప్రైజ్ చేశాడు రణబీర్. మొత్తానికి ప్రోమోతో ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ విడుదలవుతుందా అనే ఆసక్తిని కలిగేలా చేసింది 'అన్ స్టాపబుల్' టీం.