English | Telugu
'టైగర్ నాగేశ్వరరావు' టీజర్.. పాన్ ఇండియా రేంజ్ లో మాస్ రాజా ఊచకోతే!
Updated : Aug 17, 2023
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
"నేటి ముఖ్యాంశాలు.. హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు" అంటూ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. 80 సెకన్ల నిడివిగల టీజర్ లో రవితేజ పాత్రను చూపించింది కాసేపే అయినప్పటికీ.. టీజర్ ని ఎంతో పవర్ ఫుల్ గా రూపొందించారు. "నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్‌ఫార్చునేట్లీ ఒక క్రిమినల్ అయ్యాడు." అంటూ నాగేశ్వరరావు పాత్రను ఎలివేట్ చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ మెప్పిస్తోంది. టీజర్ చూస్తుంటే రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ సక్సెస్ అందుకుంటాడనే నమ్మకం కలుగుతోంది.
జి. వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.