English | Telugu
విజయ్‌కాంత్ పరిస్థితి విషమించిందా.. క్లారిటీ ఇచ్చిన నాజర్!
Updated : Dec 2, 2023
కోలీవుడ్ సీనియర్ నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయ్‌కాంత్ అస్వస్థత కారణంగా గతనెల హాస్పిటల్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కి తరలించారు. ఆస్పత్రి వైద్యులు విజయ్‌కాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, 14 రోజులపాటు నిర్విరామంగా చికిత్స చెయ్యాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. విజయ్‌కాంత్ పరిస్థితి మరింత విషమించిందని, అభిమానులు ఆందోళన చెందుతున్నారనే వార్తను కొందరు స్ప్రెడ్ చేస్తున్నారు. మరికొందరు విజయ్‌కాంత్ మృతి అని కన్‌ఫర్మ్ చేసేసి రాస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నటుడు నాజర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఆస్పత్రి సిబ్బందితో తాను మాట్లాడానని చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు. కెప్టెన్ కోలుకొని త్వరలోనే తిరిగి వస్తారని, అభిమానులు ఆందోళన చెందవద్దని అన్నారు.