English | Telugu

'తాలీ' వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: తాలీ
నటీనటులు: సుస్మిత సేన్, కృతిక డియో, ఐశ్వర్య నర్కర్, అంకుర్ భాటియా, నందు మాదవ్ తదితరులు
ఎడిటింగ్: ఫైజల్
సినిమాటోగ్రఫీ: రాఘవ్ రామదాస్
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: క్షితిజ్ పట్వర్థన్
నిర్మాతలు: అర్జున్ సింగ్ బరన్, కార్తిక్ డి నిషాందర్, సులేమాన్ నదియావాలా
దర్శకత్వం: రవి జాదవ్
ఓటిటి: జియో

ట్రాన్స్ జెండర్ ల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరీ సావంత్ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ ఈ 'తాలీ'. బాలివుడ్ నటి సుస్మిత సేన్ లీడ్ రోల్ లో చేసిన ఈ సిరీస్ ని రవి జాదవ్ తెరకెక్కించారు. మరి జియో సినిమాలోని విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం..

కథ:
గౌరీ తన గురించి తనే చెప్తూ మొదలుపెట్టిన ఈ కథ.. ఒక స్కూల్ లో గణేష్ అనే స్టూడెంట్ ని పెద్దయ్యాక ఏం అవుతావని అడుగడంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే ఆ గణేష్ అనే స్టూడెంట్ పెద్దయ్యాక అమ్మనవుతానని చెప్పడంతో ఆ క్లాస్ మేడమ్ అతడిని క్లాస్ బయటకు పంపించేసి శిక్షని విధిస్తుంది. అయితే ఆ గణేష్ ఒక పోలీస్ అధికారి కొడుకు కావడంతో ఒకరోజు డ్యాన్స్ షోలో తన కొడుకు అమ్మాయిలా రెడీ అయి డ్యాన్స్ చేస్తుంటే తీసుకొచ్చి శిక్షిస్తాడు. గణేష్ తల్లి కొన్ని రోజులకి చనిపోతుంది. అయితే అప్పటికే గణేష్ వాళ్ళ నాన్న.. అమ్మాయిలా ఉండాలనుకుంటే ఈ ఇంట్లో ఉండకూడదని అతనికి చెప్పగా.. అతను పూణె నుండి ముంబైకి వెళ్తాడు. అక్కడ గణేష్ గౌరీ(అమ్మాయి)లా మారతాడు. అయితే అలా మారిన తర్వాత అమ్మ అవ్వాలనుకున్న తన కలని నెరవేర్చుకుందా? తనకెదురైన సమస్యలేంటి? ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం పోరాడిన గౌరీ విజయం సాధించిందా లేదా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం, వారి గుర్తింపు శ్రీగౌరీ సావంత్ న్యాయ పోరాటం చేశారు. 2019 లో ఎన్నికల కమీషన్ ఆమెను మహారాష్ట్ర ప్రచార కర్తగా నియమించింది. ఆమె బయోపిక్ ఈ 'తాలీ'. అయితే ఈ సిరీస్ లో కథ చాలా సహజంగా సాగుతుంది. మితిమీరిన డైలాగ్స్ లేకుండా కల్పితంగా ఏదీ అనిపించదు. మన చుట్టూ ఉన్న సమాజం ట్రాన్స్ జెండర్ ల విషయంలో ఎలా ఉంటుందో చక్కగా చూపించారు డైరెక్టర్ రవి జాదవ్.

గణేష్ తన బాల్యంలో చేసే కొన్ని పనులను వివరిస్తూ మొదటి ఎపిసోడ్ ప్రారంభమైంది. కథలోని క్యారెక్టర్ల పరిచయానికి కాస్త టైమ్ తీసుకున్నాడు డైరెక్టర్ రవి జాదవ్. మొదటి ఎపిసోడ్ అన్ని క్యారెక్టర్ల పరిచయంతో ముగియగా.. గణేష్ బాల్యం, తను చిన్నప్పటి నుండి గౌరీగా ఎలా మార్పు చెందాడు.. ట్రాన్స్ జెండర్ లకి ఈ సమాజంలో ఎలాంటి అవమానాలు ఉంటాయనే దానిపై రెండు, మూడు, నాలుగు ఎపిసోడ్ లు నడుస్తాయి. అయితే ఈ ఎపిసోడ్‌ల నిడివి ఎక్కువ ఉండటంతో కాస్త కథ స్లోగా సాగుతుంది.

అయితే ఐదవ ఎపిసోడ్‌లో ముఖ్యమైన అంశం గురించి ప్రస్తావిస్తూ కథలో వేగం పెరుగుతుంది. 'కాంచన' సినిమాలో శరత్ కుమార్ నటనకి ఫిదా అవ్వని వాళ్ళుండరు. అదే తరహాలో ఈ సినిమాలో గౌరీగా సుస్మిత సేన్ చెప్పే ప్రతీ డైలాగ్ ఆలోచింపచేస్తుంది. అవమానాల నుండి చప్పట్ల వరకు నా పయనం అని చెప్పిన గౌరీ(సుస్మిత సేన్).. అలా అందరితో చప్పట్లు కొట్టించడానికి ఎంతలా కష్టపడిందో చక్కగా చూపించాడు డైరెక్టర్ రవి జాదవ్.

గణేష్ గౌరీగా మారినప్పుడు తన తండ్రి చేసే పనులు భావోద్వేగానికి గురిచేస్తాయి. తన కలలని అర్థం చేసుకోని, ఎవరు లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ని స్థాపించిన గౌరీ పాత్ర ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తంలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేవు.. ప్రతీ చోట ఒక మనిషి ఎదుగుతుంటే పక్కనున్నవాడే తట్టుకోలేకపోతాడు. ఇలాంటి లోతైన ఆలోచనని కూడా చాలా సున్నితంగా చూపించాడు డైరెక్టర్ రవి జాదవ్. ఎదిగేవాడికి శత్రువులు పెరుగుతారు.. అలాగే ఎదిగినవాడి ముందు చప్పట్లు కొడతారని గౌరీ చెప్పే కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఫైజల్‌ ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. రాఘవ్‌ రామదాస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. క్షితిజ్ పట్వర్థన్‌ డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ లో వచ్చే.. నువ్వు కష్టాలనివ్వు భగవంతుడా.. నేను సులువు చేస్తా అని వచ్చే డైలాగ్ హైలైట్ గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు పనితీరు:
బయోపిక్ లో నటించడమంటే కత్తి మీద సాము‌ లాంటిదే. అలాంటిది ఒక అమ్మాయి.. ట్రాన్స్ జెండర్ గా చేయడమనేది చాలా కష్టం. ‌అలాంటిది ట్రాన్స్ జెండర్ శ్రీగౌరీ సావంత్ పాత్రలో సుస్మిత సేన్ నటించడమే అసాధ్యం. ‌కానీ సుస్మిత సేన్ ఈ పాత్రకి న్యాయం చేశారు. సిరీస్ మొత్తంలో తనే కన్పిస్తుంది. ఇది సుస్మిత సేన్ జీవితమన్నట్టుగా లీనమై చేసింది. ఇక మిగిలిన పాత్రల్లో చేసిన వారంతా వారి పరిధి మేరకు బాగానే నటించారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
కొన్ని స్లో సీన్స్ పక్కనపెడితే, బయోపిక్ లని ఇష్టపడేవారిని సుస్మిత సేన్ చేసిన ఈ 'తాలీ' కట్టిపడేస్తుంది‌.

రేటింగ్: 2.75/5

✍🏻.దాసరి మల్లేశ్

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.