English | Telugu
రి-రిలీజ్ ట్రెండ్: రూ. కోటి క్లబ్ లో తొమ్మిదో చిత్రంగా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'!!
Updated : Aug 5, 2023
తెలుగునాట రి-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్లాస్, మాస్ తేడా లేకుండా కొన్ని సినిమాలు రి-రిలీజ్ లోనూ వసూళ్ళు కురిపిస్తున్నాయి. అలాగే.. అప్పట్లో డిజాస్టర్స్ గా నిలిచిన 'ఆరెంజ్' లాంటి చిత్రాలు కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతూ విస్మయపరుస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడిప్పుడే డబ్బింగ్ సినిమాలు కూడా చేరుతుండడం విశేషం.
కాగా, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రి-రిలీజ్ మూవీస్ పరంగా మొదటి రోజు రూ. కోటికి పైగా వసూళ్ళు చూసిన సినిమాల సంఖ్య 8. 'పోకిరి', 'జల్సా', 'ఖుషి', 'ఒక్కడు', 'ఆరెంజ్', 'దేశముదురు', 'సింహాద్రి', 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రాలు రి-రిలీజ్ లో రూ. కోటికి పైగా గ్రాస్ ఆర్జించాయి. కట్ చేస్తే.. ఇప్పుడీ లిస్ట్ లో ఓ డబ్బింగ్ మూవీ చేరింది. అదే.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. సూర్య ద్విపాత్రాభినయంలో గౌతమ్ మీనన్ రూపొందించిన ఈ 2008 నాటి సినిమా.. నిన్న (ఆగస్టు 4) మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ప్రదర్శితమైన ప్రతీ చోట అనూహ్య స్పందనను రాబట్టుకుని టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' తొలిరోజు దాదాపు రూ. 1.72 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందని తెలిసింది. మరి.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని డబ్బింగ్ సినిమాలు ఈ జాబితాలో చేరుతాయో చూడాలి.