English | Telugu
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకటేష్.. పవన్ సినిమా ఏమైంది?
Updated : Oct 10, 2023
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి మంచి పేరుంది. 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'ధృవ' వంటి హిట్ సినిమాలు ఆయన డైరెక్షన్ లో వచ్చాయి. అయితే ఈమధ్య ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా లేదు. 'సైరా నరసింహారెడ్డి' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ భారీ బిజినెస్ కారణంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక 'ఏజెంట్' అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సురేందర్ రెడ్డి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అది మొదలు కావడానికి సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉంటే ఆయనకు ఇప్పుడు వెంకటేష్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ తన 75వ సినిమా 'సైంధవ్'ని శైలేష్ కొలను డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా 2024 జనవరి 13న విడుదల కానుంది. 'సైంధవ్' తర్వాత వెంకటేష్ చేయబోయే మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే అని తెలుస్తోంది. ఇది వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని సమాచారం. ఇంతకాలం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అలరించిన సురేందర్ రెడ్డి మొదటిసారి వెంకటేష్ కోసం ఫ్యామిలీ బాట పడుతున్నట్లు వినికిడి. ఈ చిత్రానికి భూపతి రాజా కథ అందిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని, ఇది పూర్తయ్యాక పవన్ ప్రాజెక్ట్ తో సురేందర్ రెడ్డి బిజీ కానున్నారని తెలుస్తోంది.