English | Telugu
ఆహాలో అవార్డ్ విన్నింగ్ మూవీ 'మట్టి కథ'
Updated : Oct 10, 2023
వైవిధ్యమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'మట్టి కథ'. ఈ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ఏకంగా 9 అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో రూపొందిన సినిమాయే 'మట్టి కథ'. భూమయ్య(అజయ్ వేద్), శ్రీను(అక్షయ్ సాయి), యాదగిరి(రాజు ఆలూరి), రాజు(బత్తుల తేజ) అనే కాలేజీ చదివే నలుగురు కుర్రాళ్ల మధ్య సాగే కథతో సినిమాను రూపొందించారు. ఈ నలుగురిలో ముగ్గురు స్నేహితులు సరదాగా సమయాన్ని గడిపేస్తుంటారు. కానీ భూమయ్య మరోలా ఆలోచిస్తుంటాడు. అందుకు కారణం.. తను రాజి(మాయ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ నలుగురి కథ ఓ వైపు ఇలా సాగుతుండగా మరో వైపు.. వారి గ్రామంలో భూ ఆక్రమణల సమస్య మొదలవుతుంది. అప్పుడే భూమయ్య జీవితం అనుకోని మలుపు తీసుకుంటుంది. ఆ ఘటనతో భూమయ్య జీవితం తలకిందులవుతుంది. విధిరాతను మార్చే నిర్ణయాలతో భూమయ్య ప్రపంచం మారిపోతుంది.
అజయ్ వేద్, మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బల్వీర్ సింగ్, అక్షయ్ సాయి, రాజు ఆలూరి, రుచిత, బత్తుల తేజ తదితరులు మట్టి కథ సినిమాలో ప్రధాన తారాగణంగా నటించి మెప్పించారు. పవన్ కడియాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. సాయినాథ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు.
స్నేహం, ప్రేమ అనే ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో రూపొందిన మట్టికథ సినిమా అక్టోబర్ 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.