English | Telugu
సుధీర్ బాబు నెవెర్ బిఫోర్ లుక్.. అప్పుడు సిక్స్ ప్యాక్, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్!
Updated : Mar 1, 2023
సిక్స్ ప్యాక్ తో ఎప్పుడూ ఫిట్ గా కనిపించే సుధీర్ బాబు తన తాజా లుక్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల 'హంట్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సుధీర్ బాబు ప్రస్తుతం 'అమృతం' ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో 'మామా మశ్చీంద్ర' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఆయన ట్రిపుల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అందులో దుర్గ పాత్రకు సంబంధించిన లుక్ తాజాగా విడుదలైంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న 'మామా మశ్చీంద్ర' చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే అనే మూడు పాత్రలు పోషిస్తున్నాడు సుధీర్ బాబు. మార్చి 1న దుర్గ లుక్, మార్చి 4న పరశురామ్ లుక్, మార్చి 7న డీజే లుక్ రివీల్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అందులోభాగంగా ఈరోజు దుర్గ పాత్రకు సంబంధించిన లుక్ ని విడుదల చేశారు. పెద్ద పొట్టతో బాగా బొద్దుగా ఉన్న ఆయన జీప్ మీద కూర్చొని.. మెడలో వేసుకున్న చైన్ ని పంటితో పట్టుకొని ఓ లోకల్ దాదా లాగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ లేని విధంగా సుధీర్ బాబు ఇలా బొద్దుగా, కొత్తగా కనిపిస్తుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇక పరశురామ్ లుక్ లో కోర మీసం, గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ గా కనిపించనుండగా.. డీజే లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. మరి సుధీర్ బాబు చూపించనున్న ఈ త్రిపాత్రాభినయం ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.