English | Telugu
సిద్ధార్థకు క్షమాపణ చెప్పిన స్టార్ హీరో!
Updated : Sep 29, 2023
ఒక హీరోకి తమ ప్రాంతంలో ఇబ్బంది ఎదురైందని, దాని వల్ల అతను ఇబ్బంది పడ్డాడని తెలుసుకున్న ఒక స్టార్ హీరో అతనికి సారీ చెప్పాడు. విషయం ఏమిటంటే ఒక సినిమా ప్రమోషన్ నిమిత్తం బెంగుళూరు వెళ్ళిన సిద్ధార్థకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అతని తాజా చిత్రం ‘చిత్తా’ ప్రమోషన్ కోసం బెంగుళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య కొంతకాలంగా వివాదం ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బెంగుళూరులో నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధార్థ ప్రెస్‌మీట్‌కి కూడా ఆందోళనకారులు వచ్చారు. ఓ తమిళ సినిమా ప్రమోషన్ ఎలా చేస్తారని సిద్ధార్థపై విరుచుకుపడ్డారు ఆందోళనకారులు. ప్రెస్‌మీట్‌ను నిలిపివేసి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సిద్థార్థ కన్నడలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. చేసేది లేక అందరికీ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సిద్ధార్థ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ స్పందించి సిద్ధార్థకు క్షమాపణ చెప్పారు.
ఈ విషయమై శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నది ఎవరో నాకు తెలీదు. అలా చేయడం తప్పు. కన్నడ ప్రజలు అందర్నీ స్వాగతిస్తారు.ఈ విషయంలో సిద్ధార్థ్‌గారికి క్షమాపణలు చెబుతున్నాను. ఆ వీడియో చూసి చాలా బాధ పడ్డాను. ఇది మనసులో పెట్టుకోకండి’ అన్నారు. శివరాజ్‌కుమార్ ఇలా క్షమాపణ చెప్పడం చాలా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.