English | Telugu
అన్ స్టాపబుల్ శ్రీలీల.. ఇది కదా అసలుసిసలు బర్త్ డే ట్రీట్ అంటే!
Updated : Jun 14, 2023
కొంతకాలంగా టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల పేరు మారుమోగుతోంది. 'పెళ్లి సందడి'తో తెలుగుతెరకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెండో సినిమా 'ధమాకా'తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె అందానికి, డ్యాన్స్ లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. అందులో బాలకృష్ణ 'భగవంత్ కేసరి', మహేష్ బాబు 'గుంటూరు కారం', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి బడా ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. నేడు(జూన్ 14) శ్రీలీల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రతి పోస్టర్ లోనూ శ్రీలీల లుక్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే త్వరలోనే ఆమె స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయేలా ఉంది.
గుంటూరు కారం:
'అతడు', 'ఖలేజా' సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో లంగా ఓణి ధరించి ఆమె ఎంతో అందంగా ఉంది.
భగవంత్ కేసరి:
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో స్వచ్ఛమైన నవ్వుతో మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తున్న శ్రీలీల లుక్ మెప్పిస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్:
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీలీల నటిస్తోంది. బర్త్ డే పోస్టర్ లో చీరకట్టులో కొంచెం బాధ, కొంచెం కోపంగా పవన్ వైపు చూస్తున్న శ్రీలీల లుక్ బాగుంది.
రామ్-బోయపాటి మూవీ:
దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం రామ్ పోతినేనితో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. కొత్త పోస్టర్ లో మోడరన్ డ్రెస్ లో కొంటెగా నవ్వుతున్న శ్రీలీల లుక్ ఆకట్టుకుంటోంది. రామ్ పేరు వినగానే మనకు ఎనర్జీ, డ్యాన్స్ ఎలా గుర్తుకొస్తాయో.. శ్రీలీల పేరు విన్నా అవే గుర్తుకొస్తాయి. ఇక ఈ ఇద్దరు కలిసి చిందేస్తే ప్రేక్షకులకు కన్నుల పండగే.
నితిన్ 32:
నితిన్ తన 32 వ సినిమాని వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులోనూ శ్రీలీలే హీరోయిన్. తాజా పోస్టర్ లో మోడరన్ డ్రెస్ లో ఆమె క్యూట్ గా కనిపిస్తోంది. నితిన్-శ్రీలీల జోడి కూడా ఎంతో బాగుంటుంది. నితిన్ డ్యాన్స్ లు అదరగొడతాని తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి చిందేస్తే అదిరిపోతుంది.
ఆదికేశవ:
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. యెల్లో శారీలో శ్రీలీల లుక్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
బన్నీతో ఆహా:
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆహా కోసం అల్లు అర్జున్ ఓ కంటెంట్ చేస్తున్నాడు. దీనికోసం బన్నీతో శ్రీలీల జోడి కట్టింది. తాజాగా బన్నీ-శ్రీలీల కలిసున్న పోస్టర్ ను విడుదల చేయగా కట్టిపడేస్తోంది.
వీటితో పాటు విజయ్ దేవరకొండ సరసన 'VD 12', కన్నడలో 'జూనియర్' వంటి సినిమాలు చేస్తోంది.