English | Telugu
శ్రీవిష్ణు లవ్ స్టోరీకి వింత ప్రాబ్లమ్!
Updated : Feb 28, 2023
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన' అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాత. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైంది.
శ్రీవిష్ణు పుట్టినరోజు కానుకగా ఈరోజు 'సామజవరగమన' మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. "ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళకి క్యాస్ట్ ప్రాబ్లమ్ వస్తుంది లేకపోతే క్యాష్ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రాబ్లమ్ నాకు వచ్చింది ఏంట్రా" అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. అసలు శ్రీవిష్ణు లవ్ స్టోరీకి వచ్చిన వింత ప్రాబ్లమ్ ఏంటి? దాని వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన గ్లింప్స్ మెప్పిస్తోంది.
రెబా మోనికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామ్ రెడ్డి, ఎడిటర్ గా ఛోటా కె. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.