English | Telugu
ప్రేక్షకులను మోసం చేసిన 'స్పై' మూవీ టీమ్!
Updated : Jun 29, 2023
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం తమ సినిమాని మేకర్స్ రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కథ విషయంలో ప్రేక్షకులని తప్పుదోవ పట్టించి, వారి దృష్టిని ఆకర్షించాలనే ఆలోచన దాదాపు ఎవరూ చేయరు. ఎందుకంటే అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. అంచనాలతో థియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులు సినిమా చూసి పూర్తిగా నిరాశచెందే అవకాశముంది. ఇప్పుడు 'స్పై' సినిమాది ఇంచుమించు అలాంటి పరిస్థితే.
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన తాజా చిత్రం 'స్పై'. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా ఇది ప్రచారం పొందింది. ప్రధానంగా ఆ అంశాన్ని హైలైట్ చేస్తూనే మూవీ టీం ప్రమోషన్స్ చేసింది. టీజర్ లో కూడా అదే అంశాన్ని హైలైట్ చేశారు. టైటిల్ లోగోలో కూడా నేతాజీ బొమ్మనే పెట్టారు. భారతీయుల దృష్టిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రియల్ హీరో. ఆయన డెత్ మిస్టరీ నేపథ్యంలో సినిమా అంటే సహజంగానే అందరి దృష్టి దానిమీద పడుతుంది. పైగా ఆ కథకి 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్న నిఖిల్ తోడయ్యాడు. అందుకే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించారు. తీరా ఈరోజు(జూన్ 29) సినిమా విడుదలయ్యాక చూస్తే, సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేతాజీ పేరుని వాడుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా అసలు నేతాజీ డెత్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కథ కాదు. కథలో నేతాజీ అంశం అనేది చిన్న భాగం మాత్రమే. అసలే ప్రధాన కథ నేతాజీ డెత్ మిస్టరీ కాకపోవడం, దానికి తోడు మిగతా సినిమా ఏమంత ఆకట్టుకునేలా లేకపోవడంతో మూవీ టీమ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.