English | Telugu
చరణ్ ఫ్యాన్స్ కి షాక్.. 'గేమ్ ఛేంజర్' వచ్చే ఏడాది కూడా లేనట్టే!
Updated : Jun 29, 2023
'గేమ్ ఛేంజర్' సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. మొదట ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశముంది అన్నారు. ఆ తర్వాత వేసవి అన్నారు. ఇప్పుడసలు వచ్చే ఏడాది రావడమే అనుమానం అంటున్నారు.
కొద్దినెలల ముందు వరకు వరుస మూవీ అప్డేట్స్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి ఉన్నారు. ఓ వైపు 'ఆర్ఆర్ఆర్' చేస్తూనే మరోవైపు తన తండ్రిలో కలిసి 'ఆచార్య' సినిమా పూర్తి చేశాడు చరణ్. అలాగే 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రారంభించాడు. అదే ఫ్లోలో సగం షూటింగ్ కూడా పూర్తి చేశాడు. కానీ 'ఇండియన్-2' రూపంలో 'గేమ్ ఛేంజర్'కి కష్టాలు ఎదురయ్యాయి.
అప్పట్లో కొన్ని కారణాల వల్ల 'ఇండియన్-2' షూటింగ్ వాయిదా పడటంతో ఆ గ్యాప్ లో చరణ్ తో 'గేమ్ ఛేంజర్'ను స్టార్ చేశాడు దర్శకుడు శంకర్. 'గేమ్ ఛేంజర్' కొంత షూటింగ్ జరిగాక, 'ఇండియన్-2' వివాదం సద్దుమణగడంతో మళ్ళీ ఆ సినిమాపైకి శంకర్ ఫోకస్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు 'ఇండియన్-2'పైనే శంకర్ పూర్తి దృష్టి ఉంది. మొన్నటిదాకా సంక్రాంతికి 'ఇండియన్-2', వేసవికి 'గేమ్ ఛేంజర్' వస్తాయనే అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు వేసవికే 'ఇండియన్-2' అని, 'గేమ్ ఛేంజర్' మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. 'ఇండియన్-2' నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'ఇండియన్-2' ఏప్రిల్ అంటే, ఇక 'గేమ్ ఛేంజర్' వచ్చే ఏడాది కూడా కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి. శంకర్ అంటేనే భారీతనం. ఆయన షూటింగ్ కి ఎక్కువ సమయం తీసుకుంటారు. అలాగే ఆయన సినిమాల్లో సీజీ కూడా ఉంటుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువే సమయం పడుతుంది. 'గేమ్ ఛేంజర్' ఇంకా 40 శాతానికి పైగా షూటింగ్ పెండింగ్ ఉందని టాక్. ఈ లెక్కన 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీ 2025 సంక్రాంతికి వెళ్ళినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.