English | Telugu

ఆస్కార్ కమిటీలో 'ఆర్ఆర్ఆర్' హీరోలు!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురష్కారాలు అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాటకి గాను ఆస్కార్ గెలుచుకోవడం సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరో అరుదైన ఘనతను సాధించింది.

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేసే 'ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌' కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి చెందిన ఆరుగురు ఉండటం విశేషం. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌ ఈ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. అయితే ఆస్కార్‌ కమిటీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకు కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.