English | Telugu
'అర్జున్ రెడ్డి'లా మారిన 'అతడు' చైల్డ్ ఆర్టిస్ట్!
Updated : Feb 15, 2023
తెలుగు ప్రేక్షకులు టీవీలలో అత్యధిక సార్లు వీక్షించిన సినిమాలలో 'అతడు' ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో దాదాపు అన్ని సీన్లు, డైలాగ్ లు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర నవ్వులు పూయిస్తుంది. అందులో బ్రహ్మి కొడుకు పాత్రలో దీపక్ సరోజ్ నటించాడు. "నాన్న ట్రైన్ తెమ్మన్నాను.. తెచ్చావా?", "మన స్కూల్ బెంచ్ లా ఎంత గట్టిగా ఉందోరా" అంటూ తన అమాయకపు మాటలతో ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అతను అర్జున్ రెడ్డిలా మారిపోయాడు.
'అతడు'తో పాటు 'ఆర్య', 'భద్ర', 'లెజెండ్' వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో వి యశస్వి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి 'సిద్ధార్థ్ రాయ్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. తాజాగా మేకర్స్ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, బడా నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. 'సిద్ధార్థ్ రాయ్' పోస్టర్లు అర్జున్ రెడ్డి చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి.
'సిద్ధార్థ్ రాయ్' అనగానే పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి' సినిమా గుర్తుకొస్తుంది. అందుకే ఆయన 'సిద్దు సిద్ధార్థ రాయ్' అంటూ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు ఆ డైలాగ్ నుంచే టైటిల్ తీసుకోవడం విశేషం. నిజానికి ఈ టైటిల్ ని పవన్ కోసం హరీష్ శంకర్ రిజిస్టర్ చేయించారట. అయితే మూవీ టీమ్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ టైటిల్ వారికి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.