English | Telugu
'ఎన్టీఆర్ 30' కోసం ముగిసిన జాన్వీ కపూర్ ఫోటో షూట్!
Updated : Feb 15, 2023
ఈ నెలలోనే 'ఎన్టీఆర్ 30' లాంచ్ ఉంటుందని, వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ నెలలోనే 'ఎన్టీఆర్ 30' లాంచ్ కి ముహూర్తం ఖరారైంది. అలాగే హీరోయిన్ కూడా ఖరారు అవ్వడంతో పాటు ఇప్పటికే ఫోటో షూట్ కూడా పూర్తి కావడం విశేషం.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఎన్టీఆర్ 30'కి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించగా, ప్రముఖంగా మాత్రం జాన్వీ కపూర్ పేరు వినిపించింది. అంతేకాదు ఆమె పేరే ఖరారైందని కూడా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా లుక్ టెస్ట్ లో భాగంగా ఆమె ఫోటో షూట్ కూడా ముగిసింది. మూవీ లాంచ్ రోజున ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఇక ఈ మూవీ లాంచ్ ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు ఎందరో ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది.