English | Telugu
భారత్ గెలుపుపై నటి వివాదాస్పద వ్యాఖ్యలు!
Updated : Nov 16, 2023
"అత్త తిట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు" అనే సామెతని గుర్తు చేస్తూ, "తాము ఓడిపోయినందుకు కాదు.. భారత్ గెలిచినందుకు" అన్నట్టుగా ఉంది పాకిస్థాన్ ఏడుపు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కి అర్హత సాధించలేక పాకిస్థాన్ ఎలిమినేట్ కాగా, భారత్ మాత్రం సెమీస్ లో గెలిచి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. దీంతో పాక్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ కడుపు మంటను బయటపెడుతున్నారు.
బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాట్స్ మెన్ తో పాటు, బౌలర్ షమీ అద్భుతమైన పర్ఫామెన్స్ తో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే భారత ఆటగాళ్ళ ప్రతిభను తక్కువచేస్తూ, వాళ్ళు మంచి నటులు అంటూ పాక్ నటి సెహర్ షిన్వారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. "భారత జట్టు ఆటగాళ్లు మంచి నటులు. మ్యాచ్ ఫిక్స్ అయిందని వారికి తెలుసు కానీ తాము నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్లు నటించారు." అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్ లో "భారత జట్టు మళ్లీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ దేశం అన్నింటిలో మనకంటే ముందుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికా గెలవాలి." అంటూ మనసులోని విషాన్ని వెళ్లగక్కింది.