English | Telugu
కావాలనే నా మీద బురద జల్లుతున్నారు.. సురేష్ కొండేటి క్లారిటీ!
Updated : Dec 4, 2023
ఇటీవల గోవాలో జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో అసౌకర్యానికి గురైన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమను అవమానపరిచిందని తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఈ వివాదంలోకి లాగారు. ఈ ఫంక్షన్ నిర్వహించింది మెగా ఫ్యామిలీ పీఆర్వో అని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. దీనిపై అల్లు అరవింద్ స్పందించి, అవార్డ్స్ ఫంక్షన్‌తోగానీ, సురేష్‌కొండేటితోగానీ తమకు సంబంధం లేదని, ఈ ఫంక్షన్ అతని వ్యక్తిగతమని, దానిలోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఫంక్షన్‌లో అసౌకర్యానికి గురైన కన్నడ చిత్ర ప్రముఖులు సురేష్ కొండేటి నుంచి తమకు వివరణ కావాలని కోరారు.
దీనిపై స్పందించిన సురేష్ కొండేటి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘అందరికీ నమస్కారం. గత 21 సంవత్సరాలుగా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే అవార్డ్స్ ఇస్తున్నాను. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గోవా ఫంక్షన్‌కి వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్‌లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నామీద కొంతమంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ స్పందించారు.