English | Telugu
కష్టాల్లో ఏడాది... చర్చిలో సమంత!
Updated : Jun 15, 2023
టాలీవుడ్ స్ట్రాంగ్ హీరోయిన్ సమంత చర్చికెళ్లారు. మయోసైటిస్‌తో ఏడాదిగా పోరాడుతున్న విషయం గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది కాలంలో తాను ఎదుర్కొన్న విషయాలు, గెలుపు ఓటములు, జీవితంలో తనకు తాను స్ఫూర్తి నింపుకున్న విధానం, ఇలా ప్రతి విషయం గురించి ప్రస్తావించారు. సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యేవారికి ఆమె మనసులోని భావోద్వేగాలు ఈ పాటికే అర్థమై ఉంటాయి. సిబేరియాలో ఉన్న చర్చిలో ఆమె ప్రార్థనలు జరిపారు. సంవత్సరకాలంగా తనకు మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నందుకు జీసస్‌కి ధన్యవాదాలు తెలిపారు.
చర్చి నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేసుకున్నారు సమంత. ``మయోసైటిస్ ఉందని కనుగొని ఇప్పటికి ఏడాది అయింది. ఈ ఏడాది నాకు సాధారణంగా గడవలేదు. నా శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉప్పు తినలేదు. తీపి తినలేదు. ధాన్యాలు వద్దన్నారు. రకరకాల మాత్రల మీద బతికాను. ప్రతి రోజూ బలవంతంగా కళ్లు మూశారు. బలవంతంగా కళ్లు తెరిచాను. నా జీవితానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఎన్నో దేవుళ్లకు పూజలు చేశాను. ప్రార్థించాను. ఆశీర్వచనాలకోసమో, గిఫ్టుల కోసమో ప్రార్థించలేదు. బలం కూడగట్టుకోవాలని, ప్రశాంతత కావాలని వేడుకున్నాను.
ప్రతిదీ ఎల్లప్పుడూ మన అధీనంలో ఉండదు అని అర్థమైంది. లేకపోయినా ఫర్వాలేదనే మానసిక స్థితిని ప్రసాదించించింది. నా చేతనైనంతా చేస్తాను. చేతకానిది వదిలేస్తాను. ఒకేసారి అందలాలు ఎక్కాలని లేదు. ఒక్కో అడుగు ముందుకేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు అద్భుతమైన విజయాలు రానక్కర్లేదు. కదలిక కూడా కీలకమే. మీలో చాలా మంది ఎన్నెన్నో ఇబ్బందులతో ఉంటారు. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను`` అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.