English | Telugu
'విరాట పర్వం' దర్శకుడితో ధనుష్ మూవీ!
Updated : Jun 15, 2023
కోలీవుడ్ స్టార్ ధనుష్ దృష్టి టాలీవుడ్ దర్శకుల మీద పడింది. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ చేసిన 'సార్' మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.120 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయనున్నారు ధనుష్. తాజాగా ఆయన మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల మొదటి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'విరాట పర్వం' కమర్షియల్ గా సక్సెస్ సాధించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అయితే 'విరాట పర్వం' విడుదలై ఏడాది అయినప్పటికీ, ఇంతవరకు వేణు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. దర్శకుడిగా ఆయన మూడో సినిమా ఈ హీరోతోనే అంటూ నాగ చైతన్య, సూర్య వంటి హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ధనుష్ తో ఆయన సినిమా ఓకే అయిందని బలంగా న్యూస్ వినిపిస్తోంది. వేణు చెప్పిన కథని ధనుష్ ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదొక పీరియాడిక్ ఫిల్మ్ అని.. తెలుగు, తమిళ భాషలలో మంచి బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది.