English | Telugu
నెలరోజుల్లో ‘సలార్’... ఆందోళనలో డిస్ట్రిబ్యూటర్లు!
Updated : Nov 21, 2023
ఒకప్పటి స్టార్ హీరోల సినిమాలకి, ఇప్పటి స్టార్ హీరోల సినిమాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. అప్పట్లో సినిమా ప్రారంభం అవుతుండగానే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చేసేవారు. సినిమా కథ ఏమిటి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు. ఎక్కడెక్కడ తీస్తున్నారు.. ఈ వివరాల గురించి పట్టించుకోకుండా సినిమా తమది అనిపించుకునేవారు. దీని కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లదే రాజ్యంగా ఉండేది. ఒక నిర్మాత సినిమా తీస్తున్నాడంటే ఏ హీరో అయితే కలెక్షన్లు వస్తాయి, ఏ హీరోయిన్ అయితే జనం బాగా చూస్తారు, సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండాలా, ఉంటే ఎవరితో చేయించాలి.. ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూటర్లే నిర్మాతలకు సూచించేవారు. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి గాలిలో దీపం పెట్టి ఎదురుచూడడమే అన్నట్టుగా తయారైంది. వందల కోట్లు పెట్టి సినిమా తీసినా నిర్మాతలు సేఫ్ అవ్వడం లేదు, డిస్ట్రిబ్యూటర్లూ సేఫ్ అవ్వడం లేదు. ఎంత రేట్ అయినా ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుక్కున్నా.. నిర్మాతలు సరైన ప్రమోషన్ చెయ్యకపోతే సినిమా జనంలోకి వెళ్ళదు. అది కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది.
ఇప్పుడు ‘సలార్’ పరిస్థితి కూడా అలాగే తయారైంది అంటున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతుండడం, రిలీజ్ వాయిదా పడడం వంటి అంశాలు సినిమాని దెబ్బతీసేలా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా మీద రానురాను క్రేజ్ తగ్గుతోందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారని సమాచారం. డిసెంబర్ 22న ‘సలార్’ రిలీజ్ అవుతుండగా దానికి సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు నిర్మాతలు. మరో నెల రోజులు మాత్రమే టైమ్ ఉంది. భారీబడ్జెట్‌తో తీసిన పాన్ ఇండియా సినిమా అంటే నెల ముందు నుంచే ఏదో ఒక మాధ్యమంలో సందడి చేస్తూనే ఉండాలి. కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభాస్ ఇప్పటికే వరస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సలార్ కూడా అటూ ఇటూ అయ్యిందంటే అతని కెరీర్ అయోమయంలో పడినట్టేనని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి.