English | Telugu
'ఆర్ఆర్ఆర్' కి ఆస్కార్.. ఇండియన్ సినిమా చరిత్రలోనే సంచలనం!
Updated : Mar 13, 2023
'బాహుబలి'తో తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ కలను నిజం చేశాడు. తెలుగు సినిమా అసలు ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్లడమే గొప్ప అనుకునే స్థాయి నుంచి.. ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకునే దాకా తీసుకెళ్లాడు. 95వ ఆస్కార్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు అందుకుంది. ఇది కేవలం తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. ఇండియన్ సినిమా చరిత్రంలోనే ఒక గొప్ప మైలురాయి.
ఇప్పటిదాకా కొందరు ఇండియన్స్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు కానీ ఒక ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ కి ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి. 'గాంధీ' సినిమాకి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా భాను అథాయ, 'స్లమ్ డాగ్ మిలియనీర్'కి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్ రెహమాన్, అదే చిత్రానికి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో రెసుల్ పూకుట్టి ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే అవి భారతీయ సినిమాలు కావు. ఇంగ్లీష్ సినిమాలకు ఇండియన్స్ పని చేసి ఆ అవార్డులు గెలుచుకున్నారు. అలాగే గునీత్ మోంగా నిర్మాణ భాగస్వామిగా ఉన్న 'పీరియడ్.. ఎండ్ ఆఫ్ సెంటెన్స్' బెస్ట్ డాక్యుమెంటరీగా ఆస్కార్ అందుకుంది. మరోవైపు ఇండియన్ సినిమాలు 'మదర్ ఇండియా', 'సలాం బొంబాయి', 'లగాన్' బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యాయి కానీ అవార్డు మాత్రం గెలుచుకోలేకపోయాయి.
ఇలా ఇప్పటిదాకా ఒక్క ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఏ విభాగంలోనూ ఆస్కార్ గెలుచుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' సంచలనం సృష్టించింది. 'నాటు నాటు' పాట ఆస్కార్ గెలుచుకోవడం ఇండియన్ సినిమా చరిత్రంలోనే ఒక రికార్డు. ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ గెలుచుకున్న మొదటి ఇండియన్ సినిమా మాత్రమే కాదు.. అసలు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆస్కార్ అందుకున్న మొదటి చిత్రం కావడం విశేషం.