English | Telugu

ఇదేం పాట నుంచి ఆస్కార్ దాకా.. 'నాటు నాటు' ప్రయాణం

"అద్భుతం జరుగక ముందు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు" అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ మాట 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు సరిగ్గా సరిపోతుంది. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఎస్.ఎస్. రాజమౌళి మల్టీస్టారర్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్కో ప్రచారం చిత్రంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. అయితే 'నాటు నాటు' పాట విడుదలైనప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హీరోలు పోషించిన పాత్రలకు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ అని వీరుల పేర్లు పెట్టి.. వారి చేత ఇలా 'నాటు నాటు' అంటూ స్టెప్పులు వేయించడం ఏంటని కొందరు పెదవి విరిచారు. అదే సమయంలో సాంగ్ ఏమంత గొప్పగా లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రాబోయే రోజుల్లో ఈ పాట అద్భుతం చేయబోతుందని అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్, చరణ్ ఖచ్చితంగా ఉంటారు. అలాంటి ఇద్దరు డ్యాన్సింగ్ స్టార్స్ కలిసి ఓ నాటు పాటకు స్టెప్పేస్తే ఏ రేంజ్ లో ఉంటుంది?. అందుకే కీరవాణి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కాలు కదిపేలా అసలుసిసలు నాటు మ్యూజిక్ ను అందించారు. ఆ నాటు సంగీతానికి మరింత నాటు తనాన్ని అద్దుతూ మట్టి పదాలతో చంద్రబోస్ అందించిన సాహిత్యం అమోఘం. ఇక 'నాటు నాటు' అంటూ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా ఆలపించి పాటని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఇవన్నీ ఒకెత్తయితే, ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫీ మరో ఎత్తు. ఆయన కంపోజ్ చేసిన అదిరిపోయే స్టెప్పులకు.. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ పర్ఫెక్ట్ సింక్ లో స్టెప్పులేసి అదరగొట్టారు. అలా అందరి సమిష్టి కృషితో ఈ పాట అద్భుతంగా వచ్చింది.

'నాటు నాటు' పాట విషయంలో మొదట్లో తెలుగు ప్రేక్షకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి పాట ఆ తర్వాత కేవలం తెలుగు రాష్ట్రాల్లోనో, దేశంలోనో కాదు.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచ నలుమూలలా నాటు నాటు పాట మారుమోగిపోయింది. దేశ విదేశాల్లోని ప్రముఖులు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. అంతలా ఈ పాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా విదేశీ ప్రేక్షకులు ఈ పాటకు బ్రహ్మరథం పట్టారు. ఈ పాట ఆస్కార్ గెలుస్తుందని మనకంటే విదేశీయులే ఎక్కువ నమ్మారు. 'నాటు నాటు పాటకి ఆస్కారా!.. కలలో కూడా జరగదు' అంటూ ఇక్కడ కామెంట్స్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం, ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో అందరిలో కాస్త నమ్మకం ఏర్పడింది. అయితే ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ముందు నుంచి సాంగ్ పట్ల నమ్మకంగా ఉంది. ముఖ్యంగా రాజమౌళి ఎంతో నమ్మకంతో అంతా తానై నడిపిస్తూ.. టీంతో సహా అమెరికా వెళ్లి ఆస్కార్స్ కోసం ప్రమోషన్స్ చేశారు. ఆ సమయంలో కోట్లకు కోట్లు డబ్బులు వృథా చేస్తున్నారు అంటూ కామెంట్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. ఇలా ఎన్నో అవమానాలు, అడ్డంకులు దాటుకొని ఇప్పుడు నాటు నాటు పాట సంచలనం సృష్టించింది.

95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ విన్నర్ గా నిలిచింది. ఒక ఇండియన్ సినిమా పాట, అందునా మన తెలుగు పాట.. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం మనందరికీ గర్వకారణం. దీనంతటికి ఆ పాట పట్ల ఆర్ఆర్ఆర్ టీంకి ఉన్న నమ్మకమే కారణమని చెప్పొచ్చు. కొందరి విమర్శలను పట్టించుకొని.. నాటు నాటుకి ఆస్కార్ గెలిచే సత్తా ఉందనే నమ్మకాన్ని కోల్పోయి.. డబ్బు వృథా చేయడం ఎందుకని భావించి ఉంటే ఈరోజు ఈ అద్భుతం జరిగేది కాదు. 'ఆస్కార్ మనకి కల కాదు.. మనం తలచుకుంటే సాధించగలం' అని నిరూపించిన తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇది నిజంగా ఇండియన్ సినిమాకి, ముఖ్యంగా తెలుగు సినిమాకి పండగ రోజు.

ఇక ఈ ఏడాది ఇండియాకి మరో ఆస్కార్ కూడా వచ్చింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో తమిళ్ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇలా ఒకే ఏడాది ఇండియాకి రెండు ఆస్కార్స్ రావడం గర్వించదగ్గ విషయం.