English | Telugu
రిలీజ్‌ల గందరగోళం.. ఇక ఆ సినిమాలకు తిప్పలు తప్పవా?
Updated : Oct 10, 2023
చిన్న హీరో సినిమా, పెద్ద హీరో సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమా సలార్‌ని దృష్టిలో పెట్టుకునే తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సలార్ డిసెంబర్ 22కి వెళ్ళడంతో అంతకుముందే డిసెంబర్‌లో, సంక్రాంతికి ఫిక్స్ అయిన సినిమాలు అయోమయంలో పడ్డాయి. ఇప్పుడేం చెయ్యాలో తెలీని పరిస్థితిలో కొన్ని సినిమాలు వున్నాయి. వాటిలో సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు ఉన్నాయి. మొదట క్రిస్మస్ సీజన్‌లో ఈ సినిమాలను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, సలార్ డేట్ ఫిక్స్ అవ్వడంతో ఈ మూడు సినిమాలు అక్కడి నుంచి తప్పుకున్నాయి. సైంధవ్ మాత్రం సంక్రాంతికి వెళ్లిపోయింది. మిగిలిన సినిమాలను ప్రీపోన్ చేసి హాయ్ నాన్న డిసెంబర్ 7న, వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8న రిలీజ్ కానున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా డిసెంబర్ 8నే రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవడం ట్రేడ్‌వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే డిసెంబర్ 1న సందీప్ వంగా కొత్త మూవీ యానిమల్ రిలీజ్ కాబోతోంది.
ఆ తర్వాత మరో పదిహేను రోజుల్లో డంకీ, కెప్టెన్ మిల్లర్, సలార్ లాంటి భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇలాంటి పొజిషన్‌లో ఈ నాలుగు సినిమాలు ఒకేవారంలో రిలీజ్ కావడం చర్చనీయాంశంగా మారింది. మరో విషయం ఏమిటంటే డిసెంబర్ 3న ఎలక్షన్స్ ఫలితాలు ఉంటాయి. అందరూ అదే ఫీవర్‌లో ఉంటారు. సినిమాలపై దాని ప్రభావం ఉండనే ఉంటుంది. ఈ నాలుగు సినిమాలకు ఎలక్షన్స్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్ని సమస్యల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమాల ఫలితాలు ఎలా వుంటాయో తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సిందే.