English | Telugu
నవీన్ పొలిశెట్టి సినిమాకి డైరెక్టర్ మారాడు.. ఎందుకో తెలుసా?
Updated : Oct 10, 2023
ఏ సినిమా అయినా మొదలైన తర్వాత అది పూర్తయ్యే వరకు ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. అయితే వాటన్నంటినీ అధిగమించి సినిమాని పూర్తి చేయగలిగితే దర్శకనిర్మాతలు సక్సెస్ అయినట్టే. కానీ, కొన్ని సినిమాలకు మాత్రం ఈ విషయంలో పరిష్కారం దొరకదు. నవీన్ పొలిశెట్టి హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ‘అనగనగా ఒకరాజు’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. గత ఏడాది ఈ సినిమా ప్రారంభమైంది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కారణం తెలీదుగానీ, సినిమా ఆగిపోయింది. ఈ సినిమానే నమ్ముకోకుండా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌కి మరో సినిమా అప్పజెప్పాడు. అదే ‘మ్యాడ్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో వెళుతోంది. పెండిరగ్‌లో ఉన్న అనగనగా ఒకరాజు చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతను జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌కి అప్పగించారని తెలుస్తోంది.
ఈ విషయంలో ఎలాంటి హడావిడి లేకుండా మార్పు జరిగిపోతోందని సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఇప్పుడు డైరెక్టర్ మారుతున్నాడు కాబట్టి శ్రీలీల ఉంటుందో లేదో చూడాలి. జాతిరత్నాలు వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేయకుండా తమిళ్‌లో శివకార్తికేయన్‌తో అనుదీప్ చేసిన ‘ప్రిన్స్’ డిజాస్టర్ అవ్వడంతో షాక్‌కి గురయ్యాడు. ఇప్పుడతనికి తప్పనిసరిగా హిట్ కావాలి. కాబట్టి ‘అనగనగా ఒకరాజు’ని ఒక దారికి తీసుకురావాలి. మరి అనుదీప్ ఈ సినిమాకు ఎలాంటి న్యాయం చేస్తాడో చూడాలి.