English | Telugu
యష్ చోప్రా సీక్రెట్ అదేనంటున్న రాణీముఖర్జీ
Updated : Feb 22, 2023
యష్ చోప్రాని బయటివారు చూడటం వేరు, కుటుంబసభ్యులు ఆయన గురించి పుంఖానుపుంఖాలుగా చెప్పడం వేరు. అందులోనూ ఆ ఇంటి కోడలు ఆయన గురించి మాట్లాడటం ఎప్పుడూ స్పెషలే. యష్ చోప్రా సినిమాల గురించి, అందులో స్త్రీల పాత్రల గురించి, అవి అంత గొప్పగా రావడానికి గల కారణాల గురించి మాట్లాడారు యష్ చోప్రా కోడలు రాణీముఖర్జీ.
చిన్నతనం నుంచీ యష్ చోప్రా సినిమాల్లో పాత్రలను చూస్తూ పెరిగానని అన్నారు రాణీముఖర్జీ. అంతే కాదు, తనకు నచ్చిన స్త్రీ పాత్రలన్నీ యష్‌చోప్రా సృష్టించినవేనని అన్నారు. యష్‌రాజ్ సినిమాల్లో మహిళల పాత్రలు అంత ఉదాత్తంగా ఉండటానికి కారణం ఆయన సతీమణి పమీల అని చెప్పారు. కొన్నిసార్లు ఆ పాత్రల తీరుతెన్నులను, స్వభావాలను ఆమె కూడా రాసేవారని అన్నారు.రాణీముఖర్జీ మాట్లాడుతూ ``స్త్రీలను మనం ఎలా చూస్తాం అనేదాన్ని బట్టే, స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తామన్నది కూడా ఆధారపడి ఉంటుంది. యష్ అంకుల్ సినిమాల్లో స్త్రీల పాత్రలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. చూడ్డానికే కాదు, ఆలోచనా పరంగానూ, స్వాభావికంగానూ గొప్పగా అనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన సినిమాల్లో పురుషుల కంటే, స్త్రీల పాత్రలకు పిసరంత ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది`` అని అన్నారు.యష్ చోప్రా స్వభావాన్ని గురించి వివరిస్తూ ``ఎప్పుడు ఎక్కడ గెట్ టు గెదర్ జరిగినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయనే. అంతగా జనాలతో మమేకమైపోతారు. ఆయనకు హాస్యచతురత ఎక్కువ. ప్రతి విషయంలోనూ చమత్కారాలు కురిపిస్తుంటారు. పసిపిల్లాడిలా అందరినీ కలుపుకుని పోతారు. ఆ తత్వం అందరికీ రాదు. అందుకే ఆయన గొప్పవాడయ్యాడు`` అని అన్నారు.
రాణీముఖర్జీ ప్రస్తుతం మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటిస్తున్నారు. అందులో ఇండియన్ మదర్‌గా, నార్వేలోని ఓ సిస్టమ్‌కి వ్యతిరేకంగా పోరాడే తల్లిగా కనిపిస్తారు. 2021లో ఆమె కమ్‌బ్యాక్ మూవీ బంటీ ఔర్ బబ్లీ2 బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది.