English | Telugu
జెనీవాలో రమ్య.. చనిపోయారంటూ వార్తలు.. అసలేం జరిగింది?
Updated : Sep 6, 2023
సినీ సెలబ్రిటీలకు ఫేక్ న్యూస్ లు ఎప్పుడూ తలనొప్పిగా మారుతుంటాయి. ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారు, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. అంతవరకు ఓకే గానీ.. మరీ బ్రతికున్న వ్యక్తులను చంపేస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన)కి అలాంటి అనుభవమే ఎదురైంది.
ఈరోజు నటి దివ్య స్పందన గుండెపోటుతో కన్నుమూశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వార్త నిమిషాల్లో వైరల్ గా మారింది. కొన్ని వెబ్ సైట్లు, ఛానల్స్ సైతం ఆ వార్తను ప్రచారం చేశాయి. దీంతో పరామర్శలు స్టార్ట్ అయ్యాయి. రమ్య(దివ్య)కి, ఆమె సన్నిహితులకు పలువురు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఈ ఫేక్ న్యూస్ గురించి తెలియక.. ఎక్కడో జెనీవాలో గాఢనిద్రలో ఉన్న రమ్య.. ఒక్కసారిగా ఈ న్యూస్ గురించి తెలిసి షాక్ అయ్యారట. నేను బ్రతికే ఉన్నాను, ఎవరో ఏదో ట్వీట్ చేస్తే దానిని గుడ్డిగా ప్రసారం చేస్తారా అని రమ్య తనను సంప్రదించిన మీడియా వర్గాలు, సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారట.
ఇటీవల కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ఆ వార్తనే కాస్త ఆలస్యంగా 'స్పందన'కు బదులుగా పొరపాటున 'దివ్య స్పందన' అని రాసి పోస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా బ్రతికున్న వ్యక్తులను చనిపోయారంటూ ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అలాంటి వార్తల వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కంగారు పడతారు. సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి.. అలాంటి వార్తల వల్ల లేనిపోని ప్రమాదం జరిగే అవకాశముంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.