English | Telugu
16 కోట్లు చీటింగ్ కేసులో నిర్మాత అరెస్ట్!
Updated : Sep 9, 2023
కొందరు ఏ పని చేసినా తమ ప్రమేయం లేకుండా వార్తల్లో వ్యక్తులుగా ఉంటుంటారు. అలాంటి వారిలో తమిళ నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ ఒకరు. ఈయన మహాలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యారు. అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుంటే వైరల్ కావటమేంటనే అనుమానం రావచ్చు. ఆయనేమో లావుగా ఉంటే అమ్మాయేమో నాజుగ్గా ఉంటుంది మరి. అలా ఇద్దరూ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. తాజాగా ఇప్పుడు రవీంద్రన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం.. ఆయనపై చీటింగ్ కేసు నమోదు కావటమే. ఓ బిజినెస్ మ్యాన్‌ను దాదాపు రూ.16 కోట్లు మోసం చేశారనే దానిపై రవీంద్రన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. 2020లో బాలాజీ అనే వ్యాపారవేత్తను రవీంద్రన్ కలిశారు. చెత్త నుంచి ఎలక్ట్రిసిటీగా మార్చే ఓ ప్రాజెక్ట్‌ను తాను స్టార్ట్ చేస్తున్నానని అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని కోరారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ నచ్చటంతో రవీంద్రన్‌కు రూ. 15.85 కోట్ల మొత్తాన్ని బాలాజీ అందించారు. డబ్బులు తీసుకున్న తర్వాత రవీంద్రన్ ఎలాంటి బిజినెస్‌ను స్టార్ట్ చేయలేదు. కొన్నాళ్లు వేచి చూసిన బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీబీ, ఈడీఎఫ్‌లలో కేసు నమోదైంది. దొంగ డాక్యుమెంట్స్‌తో తాను వ్యాపారాన్ని ప్రారంభించినట్లు లాభ నష్టాలను చూపించినట్లు నమ్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు తర్వాత రవీంద్రన్ చంద్రశేఖర్ కనిపించకుండా దాక్కున్నారు. చివరకు పోలీసులు అన్వేషించి ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కేసుని పరిశీలించిన కోర్టు ఆయనకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. ఈ విషయంపై ఇప్పుడు మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలని నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమె ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.