English | Telugu
వై.ఎస్.జగన్‌ని టార్గెట్ చేస్తున్న ‘రంగం’ హీరో, విలన్!
Updated : Sep 9, 2023
సినిమా రంగంలో ఎవరు ఎలాంటి క్యారెక్టర్స్ చెయ్యాల్సి వస్తుందో, వారి కెరీర్ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి వారు ఎప్పుడూ ఊహించని క్యారెక్టర్స్ చెయ్యాల్సి వస్తుంది. ఆ క్యారెక్టర్స్‌తోనే వారి కెరీర్ గ్రాఫ్ పెరిగిన సందర్భాలు కూడా ఉంటాయి. 2011లో అంటే దాదాపు 12 సంవత్సరాల క్రితం కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగం’ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. అది అప్పట్లో పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. జీవా, కార్తీక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్ విలన్‌గా నటించాడు. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన అజ్మల్ ఆ తర్వాత రామ్‌గోపాల్‌వర్మ నేతృత్వంలో రూపొందిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో వై.ఎస్.జగన్ పాత్రలో నటించాడు.
తాజాగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే రూపొందుతున్న ‘వ్యూహం’ చిత్రంలోనూ అజ్మల్ మరోసారి వై.ఎస్.జగన్‌గా కనిపించబోతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ఆర్‌జివి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క ‘యాత్ర2’ చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. 2019లో మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ చిత్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటించారు. ఇప్పుడు ‘యాత్ర 2’లో వై.ఎస్.జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నాడు.
ఇక్కడ విశేషం ఏమిటంటే ‘రంగం’ చిత్రంలో జీవా, అజ్మల్ మొదట్లో కాలేజ్ ఫ్రెండ్స్‌గా నటించినా ఆ తర్వాత జీవా హీరోగానూ, అజ్మల్ విలన్‌గానూ ఎస్టాబ్లిష్ అవుతారు. ఇప్పుడు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న రెండు చిత్రాల్లో వీరిద్దరూ వై.ఎస్.జగన్ పాత్రలే చేయడం విశేషమే అయినా కాకతాళీయం కూడా. ఎన్నికల ముందు విడుదలయ్యే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు, ఇద్దరిలో ఎవరిని వై.ఎస్.జగన్‌గా అంగీకరిస్తారో వేచి చూద్దాం.