English | Telugu
పాయల్ మంగళవారం బిజినెస్ మామూలుగా లేదుగా!
Updated : Oct 26, 2023
'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మహా సముద్రం' మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక 'ఆర్ఎక్స్ 100'తోనే హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ ఆ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు కూడా సరైన విజయాల్లేవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'మంగళవారం' అనే సినిమాలో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.
ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ 'మంగళవారం'. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గ్రామంలో మంగళవారం నాడు జరిగే హత్యల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఇంటెన్స్ గా సాగింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అసలే హారర్ థ్రిల్లర్ జానర్, దానికితోడు ఇందులో పాయల్ ది బోల్డ్ రోల్ కావడంతో.. యూత్ ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ గా 'మంగళవారం' రూ.15 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఫిమేల్ సెంట్రిక్ చిన్న సినిమాలకు ఈ స్థాయి బిజినెస్ జరగడం నిజంగా గొప్ప విషయమే. 'ఆర్ఎక్స్ 100' కాంబో, దానికి తోడు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ స్థాయి బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే(ఆంధ్ర, సీడెడ్ కలిపి) రూ.7.20 కోట్ల బిజినెస్ చేసిందట. ఇప్పుడు ఆ బయ్యర్లు రిటైల్ గా ఒక్క ఆంధ్రనే రూ.6 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట.
నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మంగళవారం చిత్రం విడుదల కానుంది. విడుదలకు ముందుకు బిజినెస్ పరంగా ఈ స్థాయి సంచలనాలు సృష్టిస్తున్న మంగళవారం.. విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.