English | Telugu
చిరంజీవితో కలిసి నటించబోయే హీరో ఎవరంటే!
Updated : Aug 7, 2023
మెగాస్టార్ చిరంజీవి దృష్టంతా ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాపైనే ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీని తర్వాత చిరంజీవి ఏ మూవీలోచేస్తారనే దానిపై అధికారిక సమాచారం అయితే లేదు. కానీ మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు సినిమా ఉంటుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మించనున్నాయి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని టాక్. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని అంటున్నారు.
చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో మరో యంగ్ హీరో కూడా కనిపించబోతున్నారు. ముందు ఈ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ తర్వాత తను సున్నితంగా తిరస్కరించాడని, తర్వాత వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సహా చాలా మంది హీరోల పేర్లు చక్కర్లుకొట్టాయి. తాజాగా ఈ లిస్టులో మరో హీరో పేరు చేరింది. ఆ హీరో ఎవరో కాదు.. శర్వానంద్. మెగా ఫ్యామిలీతో శర్వాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. శర్వానంద్ తన బిడ్డలా ఇంట్లోనే పెరిగాడని ఓ సందర్భంలో చిరంజీవి కూడా చెప్పారు. ఇప్పడుచిరంజీవితో శర్వా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
చిరంజీవి, శర్వానంద్ కలిసి నటించటం కొత్తేమీ కాదు. ఇద్దరూ కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించారు. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ మూవీ కన్‌ఫర్మ్ అయితే ఇద్దరూ కలిసి నటించటం రెండోసారి అవుతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి నెక్ట్స్ సినిమా బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్‌లో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.