English | Telugu
పేరుకి పాన్ ఇండియా మూవీ.. పార్ట్-2 కి బజ్ ఏది?
Updated : Apr 23, 2023
పాన్ ఇండియా సినిమాకి, అందునా పార్ట్-2 కి ఉండే క్రేజే వేరు. 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' సినిమాల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారో తెలిసిందే. అందుకే ఆ సినిమాలు మొదటి భాగాలను మించి ఎన్నో రెట్ల విజయాన్ని సాధించాయి. అయితే కోలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'పొన్నియన్ సెల్వన్-2' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం అదే పేరుతో 'పొన్నియన్ సెల్వన్' అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనిని తమిళ బాహుబలిగా అక్కడి సినీ ప్రముఖులు, సినీ అభిమానులు భావించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్స్ నటించిన ఈ చిత్ర మొదటి భాగం గతేడాది విడుదలై దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో అక్కడ సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఇతర భాషల ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం మెప్పించలేకపోయింది. పాత్రలు పేర్లు గుర్తుపెట్టుకోవడం, వారి మధ్య బంధాన్ని అర్థం చేసుకోవడం.. ప్రేక్షకులకు పెద్ద టాస్క్ లా అనిపించింది. ఆ సినిమాలో నటించిన కార్తీనే మొదట్లో ఆ పాత్రల విషయంలో గందరగోళానికి గురయ్యాడంటే.. ఇక 'పొన్నియన్ సెల్వన్' నవలపై ఏమాత్రం అవగాహన లేని ఇతర భాషల ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు నెమ్మదిగా సాగే కథనం కూడా ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి ఒక కారణం. అందుకేనేమో 'పొన్నియన్ సెల్వన్-2'పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు.
మామూలుగా ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి రెండో భాగం వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. మొదటి భాగాన్ని మించేలా ఓపెనింగ్స్ వస్తాయి. కానీ 'పొన్నియన్ సెల్వన్-2' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. మొదటి భాగం స్థాయిలో కూడా రెండో భాగానికి అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఈ ఏప్రిల్ 28 నే ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా విడుదలకు ఐదు రోజులు కూడా లేదు. అయినా సినిమాపై బజ్ క్రియేట్ కాలేదు. ఈ సినిమా విడుదలవుతుందని తమిళ్ తప్ప ఇతర భాషల్లో సాధారణ ప్రేక్షకులకు అవగాహన కూడా లేదు. మిగతా పాన్ ఇండియా సినిమాల్లాగా మొదటి భాగం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్లను రాబట్టడం సంగతి అటుంచితే.. కనీసం మొదటి భాగానికి వచ్చినన్ని వసూళ్లయినా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.