English | Telugu
వెర్రి అభిమానం.. పవన్ ఫ్యాన్ ని కొట్టి చంపిన ప్రభాస్ ఫ్యాన్!
Updated : Apr 23, 2023
మేం మేం బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలని హీరోలు ఎంత చెప్పినా కొందరు అభిమానుల్లో మార్పు రావడం లేదు. వెర్రి అభిమానంతో ఇతర హీరోల అభిమానులను శత్రువుల్లా భావిస్తూ.. బంగారంలాంటి భవిష్యత్ ని పాడు చేసుకుంటున్నారు. కొందరు సోషల్ మీడియాలో హీరోల కుటుంబాలను, అభిమానులను దూషిస్తూ టైం వేస్ట్ చేస్తుంటే.. మరికొందరు విచక్షణ కోల్పోయి బయట ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
ఏలూరుకు చెందిన కిషోర్, హరి పెయింటర్లు. ఇటీవల వీరిద్దరూ అత్తిలిలోని ఓ ఇంట్లో పెయింట్ వేయడానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి పని ముగించుకొని అదే ఇంట్లో బస చేయగా.. అభిమాన హీరోల విషయంలో జరిగిన చిన్న గొడవ ఒక నిండు జీవితాన్ని బలి తీసుకుంది. వీరిలో కిషోర్ పవన్ కళ్యాణ్ అభిమాని కాగా, హరి ప్రభాస్ అభిమాని. అయితే కిషోర్ పెట్టిన పవన్ వాట్సాప్ స్టేటస్ విషయంలో ఇద్దరి మధ్య వాదన జరిగినట్టు తెలిసింది. మాటమాట పెరిగి హరి కర్రతో కిషోర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కిషోర్ మృతి చెందగా.. హరి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. హీరోల మీద అభిమానమనేది సినిమాలు చూసి ఆనందించే వరకే ఉండాలి కానీ ఇలా ప్రాణాలు తీసుకునేలా ఉండకూడదనే విషయాన్ని.. ఇప్పటికైనా ఇలాంటి కొందరు వెర్రి అభిమానులు గమనిస్తే మంచిది. ఇలాంటి వారి వల్ల వారు అభిమానించే హీరోలతో పాటు తోటి అభిమానులకు కూడా చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.