English | Telugu
‘లియో’కు తమిళ ప్రభుత్వం జలక్
Updated : Sep 16, 2023
మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దళపతి విజయ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు విజయ్ అభిమానులతో పాటు ఆడియెన్స్, ట్రేడ్ వర్గాలు సైతం ‘లియో’ రిలీజ్ కోసం చాలా ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాయి. అందుకు కారణం.. రిలీజ్ తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందోనని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
ఇంతకీ ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం ‘లియో’కు ఎలాంటి షాకిచ్చిందనే వివరాల్లోకి వెళితే.. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండటం అనేది కామన్‌గా జరిగే విషయమే. అయితే విజయ్ సినిమాకు అలాంటి షోస్‌కు అనుమతి లేదంటూ తమిళ ప్రభుత్వం చెప్పేసింది. ఏకంగా ఉదయం 11 గంటల షోకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. అంతకు ముందు 9 గంటల షోకు కూడా పర్మిషన్ లేదని సమాచారం. ఇది విజయ్ అండ్ కోకు ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి దీనిపై విజయ్ ఏమైనా స్పందిస్తారేమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
‘లియో’ విషయానికి వస్తే ఇందులో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. లోకేష్ యూనివర్స్‌లో సినిమా ఉంటుందా..లేదా? అనే దానిపై త్వరలోనే ఓ ఐడియా రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. లలిత్ కుమార్, జగదీష్ ఈ సినిమాను నిర్మించారు.